‘మాకు ఏమైనా జరిగితే నాన్నదే బాధ్యత’.. ఎమ్మెల్యే కుమారుడి సంచలన వ్యాఖ్యలు

Santosh Goud says father Prakash Goud is responsible if anything happens to them
  • రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై కుమారుడు సంతోష్‌ గౌడ్ ఆరోపణలు
  • ప్రేమ పెళ్లిని అడ్డుకుంటున్నారని వెల్లడి
  • రూపారెడ్డి కుమార్తెతో నిశ్చితార్థం జరిగిందన్న సంతోష్‌
  • 40 మందితో దాడి చేయించారని ఆరోపణ
  • ఫిర్యాదు స్వీకరించలేదంటూ పోలీసులపై విమర్శ
  • రాజకీయ ఒత్తిళ్లతో కేసులు పెట్టారని ఆరోపణ
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై ఆయన కుమారుడు సంతోష్‌ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడాన్ని తన తండ్రి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమకు ఏదైనా జరిగితే అందుకు ప్రకాశ్ గౌడ్‌నే బాధ్యుడిగా భావించాలని అన్నారు.

మణికొండకు చెందిన బీఆర్ఎస్ నాయకురాలు రూపారెడ్డి కుమార్తెను తాను ప్రేమిస్తున్నానని సంతోష్‌ గౌడ్ తెలిపారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పగా తొలుత కుటుంబ సభ్యులు అంగీకరించలేదని చెప్పారు. తర్వాత తన ఇష్టప్రకారం పెళ్లి చేసుకోవచ్చని చెప్పడంతో గత నెలలో నిశ్చితార్థం చేసుకున్నానని వెల్లడించారు. అప్పటి నుంచి రూపారెడ్డి ఇంట్లోనే ఉంటున్నట్లు తెలిపారు.

తమను అంతం చేయాలనే ఉద్దేశంతో దాదాపు 40 మందితో తన కాబోయే అత్త ఇంటిపై దాడి చేయించారని సంతోష్‌ గౌడ్ ఆరోపించారు. ఈ ఘటన వెనుక తన తండ్రి ఉన్నారని అన్నారు.

దాడి విషయాన్ని పోలీసులకు తెలియజేసినా ఫిర్యాదును సరిగా స్వీకరించలేదని సంతోష్‌ గౌడ్ ఆరోపించారు. నార్సింగ్ పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో తమపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. మీడియా ముందుకు రావడంతో తమ ప్రాణాలకు ముప్పు ఉందని  ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఇంకా స్పందించలేదు.
Advertisement
Santosh Goud
Prakash Goud
Rajendranagar MLA
MLA Son Marriage Controversy
Roopa Reddy BRS
Narsingi Police Case

More Telugu News