యూపీలో భారీ వర్షాలు.. ఇల్లు కూలి ఆరుగురి మృతి

Six died in UP after house collpse
  • యూపీ ప్రతాప్‌గఢ్‌లో భారీ వర్షానికి కూలిన వందేళ్ల నాటి ఇల్లు
  • ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు శిథిలాల కింద నలిగి మృతి
  • మృతుల్లో నాలుగు నెలల పసికందు, రెండేళ్ల బాలుడు
  • ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి
ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లాలో సుమారు వందేళ్ల నాటి పురాతన భవనం కుప్పకూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నాలుగు నెలల పసికందు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది.

ప్రతాప్‌గఢ్ జిల్లాలోని మహౌలీ వార్డులో ఓ కుటుంబం నివసిస్తున్న పురాతన ఇల్లు భారీ వర్షానికి ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో ఇంటి యజమాని ప్రమోద్ శ్రీవాస్తవ (60), ఆయన భార్య రీటా (55), కుమారుడు నితిన్ (25), కోడలు మాధురి (23)తో పాటు వారి ఇద్దరు పిల్లలు మాధవ్ (2), అద్విక్ (4 నెలలు) అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా, అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

కాగా, గత కొన్ని రోజులుగా యూపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లఖ్‌నవూ, మథుర, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, నోయిడా వంటి ప్రధాన నగరాల్లో జనజీవనం స్తంభించింది. రాబోయే రోజుల్లో పశ్చిమ, తూర్పు యూపీలో ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పాత భవనాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు.
Advertisement
Uttar Pradesh
House Collapse
Pratapgarh
Yogi Adityanath
Tragedy

More Telugu News