ఇది ట్రోలింగ్ కాదు.. పెద్ద నేరం: సోషల్ మీడియా వేధింపులపై ముంబై మోడల్ రియా అహిర్

This is not trolling it is a big crime Mumbai model Riya Ahir on social media harassment
  • రాహుల్‌ గాంధీతో కలిసి మీడియా ముందుకు వచ్చిన మోడల్ రియా అహిర్
  • తనపై తీవ్రమైన ఆన్‌లైన్ వేధింపులు జరుగుతున్నాయని ఆవేదన
  • ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపణ
  • ముంబై విద్యార్థి నిరసనలో పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని గుర్తింపు పొందిన  రియా
  • రియా ధైర్యాన్ని ప్రశంసించి, అండగా నిలిచిన రాహుల్ గాంధీ
ముంబైలో విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసు వ్యాన్‌కు అడ్డుగా నిలబడి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోడల్ రియా అహిర్, ఆ ఘటన తర్వాత తాను తీవ్రమైన ఆన్‌లైన్ వేధింపులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కంటతడి పెట్టారు. తనను "వైరల్ గర్ల్"గా కాకుండా, 20 మంది విద్యార్థులను పోలీసుల అక్రమ నిర్బంధం నుంచి కాపాడిన వ్యక్తిగా గుర్తుంచుకోవాలని కోరారు.

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. "ఇది ట్రోలింగ్ కాదు, పెద్ద నేరం. కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా నాపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు" అని ఆమె తెలిపారు. ఈ వేధింపులపై జులై 27న పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఆగస్టు 5 వరకు కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని రియా ఆరోపించారు. "ఈ సమాజంలో ఆడపిల్లలను చదువుకోనివ్వట్లేదు, వారిని రక్షించలేకపోతున్నారు" అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

విద్యా వ్యవస్థలోని లోపాలు, పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆధ్వర్యంలో ముంబైలోని దాదర్‌లో జరిగిన నిరసనలో రియా పాల్గొన్నారు. విద్యార్థులను అరెస్టు చేసి తీసుకెళ్తున్న వ్యాన్‌కు ఎదురుగా చేతులు చాపి నిలబడిన ఆమె వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.

ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం గళమెత్తడం నేరం కాదని, రియా అహిర్ ధైర్యానికి తాము అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
Advertisement
Riya Ahir
Rahul Gandhi
Mumbai Student Protest
Social Media Harassment
Viral Girl Mumbai
Paper Leak Protest

More Telugu News