Advertisement

ఏంటీ ‘సముద్ర మంథన్‌’?.. రూ.84 వేల కోట్లతో కేంద్రం ఎందుకు చేపడుతోంది?

Samudra Manthan what is this 84000 crore project by Central Government
  • సముద్ర గర్భంలో చమురు, గ్యాస్‌ అన్వేషణ లక్ష్యం
  • 2030-31 వరకు ప్రాజెక్టు సమయం
  • చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించే ప్రయత్నం
  • 600 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల నిల్వల అంచనా
  • ఇంధన భద్రత, పెట్టుబడులు, ఉపాధికి ఊతం
చమురు, సహజ వాయువు కోసం భారత్‌ సముద్రాల వైపు అడుగులు వేస్తోంది. విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించి దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘సముద్ర మంథన్‌’ పేరుతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రూ.84,084 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ కార్యక్రమం దేశ ఇంధన భద్రతలో కీలక మైలురాయిగా మారనుంది.

కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ ఆఫ్‌షోర్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ స్కీమ్‌’ పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగనున్న ఈ ప్రాజెక్టు కోసం రూ.84,084 కోట్లను కేటాయించింది. సముద్ర గర్భంలో దాగి ఉన్న చమురు, సహజ వాయువు నిల్వలను గుర్తించడమే ప్రధాన లక్ష్యం. హిందూ పురాణాల్లోని ‘సముద్ర మథనం’ కథ నుంచి స్ఫూర్తి పొంది ఈ పథకానికి ఆ పేరు పెట్టారు. సముద్రంలో దాగి ఉన్న సంపదను వెలికితీసే భావనను ఇది ప్రతిబింబిస్తుందని కేంద్రం తెలిపింది.

ప్రస్తుతం భారత్‌కు అవసరమైన ముడి చమురులో దాదాపు 88-89 శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. సహజ వాయువులో సగం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇంధన అవసరాలు పెరుగుతున్న వేళ దాన్ని తగ్గించేందుకు సముద్ర గర్భంలో కొత్త నిల్వలను కనుగొనడం అత్యవసరంగా మారింది. అయితే లోతైన సముద్రాల్లో అన్వేషణ ఖర్చుతో కూడుకొన్నది. సాంకేతికంగా క్లిష్టమైన ప్రక్రియ కూడా. అందుకే ఈ రంగంలో ప్రభుత్వమే ముందడుగు వేస్తోంది.

ఈ పథకం కింద సముద్ర బేసిన్‌లను అత్యాధునిక భూకంప సర్వే సాంకేతికతతో పరిశీలిస్తారు. ఆశాజనక ప్రాంతాల్లో అన్వేషణ బావులు తవ్వుతారు. లోతైన సముద్ర ప్రాంతాల్లో శాస్త్రీయ అధ్యయనాలు నిర్వహిస్తారు. ఉమ్మడి ఆఫ్‌షోర్‌ మౌలిక వసతులు, చమురు-గ్యాస్‌ తయారీ సేవల కేంద్రాలు, డిజిటల్‌ నిర్వహణ వ్యవస్థలు, నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తారు. ఈ ప్రక్రియతో నాణ్యమైన భౌగోళిక సమాచారం సిద్ధమై, ప్రైవేట్‌ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ కార్యక్రమం ఫలిస్తే 600 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పైగా చమురు నిల్వలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. వాణిజ్య ఉత్పత్తికి ఇంకా సమయం పట్టినా, విజయవంతమైతే దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు ఇంధన భద్రత బలోపేతం అవుతుంది. పెట్టుబడులు పెరగడం, ఉపాధి అవకాశాలు విస్తరించడం, సముద్ర ఇంధన రంగంలో భారత్‌ సామర్థ్యం మరింత పెరగడం వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయని కేంద్రం ఆశిస్తోంది.
Advertisement
Samudra Manthan
National Offshore Exploration Scheme
India oil and gas exploration
Central Government energy project
Deep sea drilling India
Energy security and oil imports

More Telugu News