కుల్గామ్ ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించిన సీఎం ఒమర్ అబ్దుల్లా
- గురువారం సాయంత్రం కాల్పులకు తెగబడిన గుర్తు తెలియని ఉగ్రవాదులు
- ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు యువ కార్మికులు మృతి
- కార్మికులపై కాల్పులు జరపడం అత్యంత హేయమన్న ఒమర్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ హేయమైన దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రకటించిన రూ.6 లక్షల తక్షణ సహాయానికి ఇది అదనం. దీంతో బాధితుల కుటుంబాలకు మొత్తం రూ.16 లక్షల మేర ఆర్థిక సాయం అందనుంది.
ఘటన వివరాల్లోకి వెళితే... కుల్గామ్ జిల్లాలోని కేలామ్ ప్రాంతంలో ఉన్న ఒక ఇటుక బట్టీ వద్ద పనిచేస్తున్న వలస కార్మికులపై గురువారం సాయంత్రం గుర్తుతెలియని ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దీపక్ రాత్రే (24), భూపేంద్ర భైనా (28) అనే ఇద్దరు యువ కార్మికులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఈ కిరాతక దాడిని తీవ్రంగా ఖండించిన సీఎం ఒమర్ అబ్దుల్లా, అమాయక కార్మికులపై దాడి చేయడం అత్యంత హేయమని పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అటు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఈ దాడిని ఖండిస్తూ, ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలను తీవ్రతరం చేయాలని ఆదేశించారు.