ఈ20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ యుద్ధం: 'అధ్యయనం లేదు.. స్పష్టత లేదు' అంటూ తీవ్ర విమర్శలు
- ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజలు నష్టపోతారన్న కేజ్రీవాల్
- వాహనాల మైలేజ్ గణనీయంగా పడిపోతుందని ఆందోళన
- ఈ20 విధానం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యాఖ్య
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వేగంగా అమలు చేస్తున్న ఈ20 (20 శాతం ఇథనాల్ కలిపిన) పెట్రోల్ విధానంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సరైన అధ్యయనాలు, స్పష్టమైన ప్రణాళికలు లేకుండానే ఈ విధానాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల మధ్యే ఈ విషయంపై ఎలాంటి సమన్వయం, స్పష్టత లేవని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజీ ఎంత తగ్గుతుందనే దానిపై ఒక మంత్రిత్వ శాఖ 2 నుంచి 5 శాతం అని చెబితే, మరొకటి 4 శాతం అని చెబుతోందని కేజ్రీవాల్ ఎత్తిచూపారు. శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సామాన్య వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇంజిన్లు వేగంగా దెబ్బతింటున్నాయని, మైలేజ్ గణనీయంగా పడిపోయి వాహనదారులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ఈ విధానాన్ని ఎందుకు నిర్బంధంగా అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇందులో ప్రభుత్వానికి ఉన్న స్వార్థ ప్రయోజనాలేమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు, వాహనదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న ఈ20 పెట్రోల్ విధానం ఏమాత్రం శ్రేయస్కరం కాదని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేసి విధానాన్ని సమీక్షించాలని కేజ్రీవాల్ కోరారు.