మారుతి నుంచి ఎలక్ట్రిక్ కార్లు.. కొత్త ప్లాంట్‌లో 'ఇ-విటారా' ఉత్పత్తి షురూ

Maruti Suzuki starts e Vitara production at new Gujarat plant
  • గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో నాలుగో ప్లాంట్‌ను ప్రారంభించిన మారుతి
  • ఏటా 10 లక్షల వాహనాల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రం
  • కొత్త ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ కారు 'ఇ-విటారా' ఉత్పత్తికి శ్రీకారం
  • కీలక ఎగుమతుల కేంద్రంగా మారిన హన్సల్‌పూర్ ప్లాంట్
  • పర్యావరణ హిత రవాణా కోసం ప్లాంట్‌లో ప్రత్యేక రైల్వే సైడింగ్
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్‌) మరో చారిత్రక మైలురాయిని అందుకుంది. గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో తన నాలుగో తయారీ ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తిని ఇవాళ‌ ప్రారంభించింది. దీంతో ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 లక్షల వాహనాలకు చేరి, దేశంలోనే ఒకేచోట ఉన్న అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ కేంద్రంగా అవతరించింది.

గతంలో 7.5 లక్షల యూనిట్ల సామర్థ్యంతో ఉన్న ఈ ప్లాంట్, కొత్త ప్లాంట్-డి ప్రారంభంతో ఇప్పుడు 10 లక్షల యూనిట్లకు విస్తరించింది. హన్సల్‌పూర్ ప్లాంట్‌పై కంపెనీ ఇప్పటివరకు రూ. 25,288.7 కోట్లు పెట్టుబడి పెట్టగా, ఇందులో కొత్తగా ప్రారంభించిన ప్లాంట్‌పైనే సుమారు రూ. 3,900 కోట్లు ఖర్చు చేసింది. ప్రపంచవ్యాప్తంగా సుజుకి తయారీ కేంద్రాల్లో ఒకేచోట 10 లక్షల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తొలి ప్లాంట్‌గా కూడా ఇది నిలిచింది. ఈ విస్తరణతో మారుతి సుజుకి మొత్తం తయారీ సామర్థ్యం ఏటా 29 లక్షల యూనిట్లకు పెరిగింది.

ఈ కొత్త ప్లాంట్‌లో మారుతి తన ఫ్లాగ్‌షిప్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (బీఈవీ) 'ఇ-విటారా'ను తొలుత తయారు చేయనుంది. దీని ద్వారా కంపెనీ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. ప్రస్తుతం హన్సల్‌పూర్ ప్లాంట్‌లో ఫ్రాంక్స్, బాలెనో, స్విఫ్ట్ వంటి ప్రముఖ మోడళ్లను ఉత్పత్తి చేస్తున్నారు.

ఈ ప్లాంట్ కంపెనీకి కీలకమైన ఎగుమతుల కేంద్రంగా కూడా మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మారుతి మొత్తం విదేశీ ఎగుమతుల్లో దాదాపు 47 శాతం వాటాను హన్సల్‌పూర్ ప్లాంటే కలిగి ఉండటం విశేషం. పర్యావరణ హితమైన రవాణా కోసం ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద 2024 మార్చిలో దేశంలోనే తొలిసారిగా ప్లాంట్ లోపల రైల్వే సైడింగ్‌ను మారుతి ఏర్పాటు చేసింది. 2023 మార్చి నుంచి ఇప్పటివరకు 7.5 లక్షలకు పైగా వాహనాలను రైళ్ల ద్వారా రవాణా చేసినట్లు, తద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించినట్లు కంపెనీ తెలిపింది. ఈ రైల్వే ప్రాజెక్టుకు అంతర్జాతీయంగా వెర్రా వెరిఫైడ్ కార్బన్ స్టాండర్డ్ (వీసీఎస్‌) గుర్తింపు కూడా లభించింది.

తయారీతో పాటు స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు కూడా మారుతి కృషి చేస్తోంది. భారత, జపాన్ ప్రభుత్వాల సహకారంతో మెహసానా, గాంధీనగర్‌లలో రెండు జపాన్-ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ (జేఐఎం)లను ఏర్పాటు చేసి, 1,200 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది.
Advertisement
Maruti Suzuki
Maruti e Vitara
Hansalpur Gujarat Plant
Maruti Suzuki EV Production
Electric Cars India
Maruti Suzuki Manufacturing Capacity

More Telugu News