అబద్ధానికి చొక్కా, ప్యాంటు వేస్తే చంద్రబాబే: కాకాణి గోవర్ధన్
- ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో కాకాణి విమర్శలు
- ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళతారని ప్రశ్న
- డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్
తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్లలో ఏమీ సాధించకుండా టీడీపీ నేతలు ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు ప్రజలకు తమ ముఖం కూడా చూపించలేక పోతున్నారని ఎద్దేవా చేశారు.
‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’ వంటి హామీల అమలులో ప్రభుత్వం కోతలు పెడుతోందని విమర్శించిన కాకాణి, "అబద్ధానికి చొక్కా, ప్యాంటు వేస్తే అది సీఎం చంద్రబాబునే" అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖను మంత్రి నారా లోకేశ్ పూర్తిగా భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు.
డీఎస్సీ నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని, దీనిపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని కాకాణి డిమాండ్ చేశారు. అభ్యర్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు జరిగిన అన్యాయంపై పేపర్లు పట్టుకుని రోడ్లపై తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి లోకేశ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ చదువులపై సెటైర్లు వేస్తూ... స్విమ్మింగ్ పూల్‌లో ఆయన చదివిన తీరు అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. డీఎస్సీ అక్రమాలపై జగన్‌కు సవాళ్లు విసరడం మాని, బాధితులకు సమాధానం చెప్పాలని, లేకపోతే మౌనంగా కూర్చోవాలని అన్నారు.