ఆటకు వీడ్కోలు పలికిన అజింక్య రహానె.. కన్నీటితో ఫేర్‌వెల్!

Ajinkya Rahane Bids Farewell To The Game With A Tearful Goodbye
  • అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్య రహానె
  • సోషల్ మీడియాలో భావోద్వేగ వీడియో ద్వారా వీడ్కోలు సందేశం
  • ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించిన కెప్టెన్‌
  • భారత్ తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు ఆడి 8000కు పైగా పరుగులు
  • కుటుంబం, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీటి పర్యంతం
టీమిండియా సీనియర్ బ్యాటర్, ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించిన కెప్టెన్ అజింక్య రహానె తన ఆటకు వీడ్కోలు పలికాడు. సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ వీడియో సందేశం ద్వారా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటన చేస్తున్న సమయంలో ఆయన కన్నీటి పర్యంతమవడం అభిమానులను కదిలించింది. భారత క్రికెట్‌లో అత్యంత నమ్మకమైన టెస్ట్ బ్యాటర్‌గా, ముఖ్యంగా విదేశీ పిచ్‌లపై మేటి ఆటగాడిగా పేరుపొందిన రహానె ప్రస్థానం దీంతో ముగిసినట్లయింది.

2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రహానె కెరీర్‌లో శిఖరాగ్రం లాంటిది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి టెస్ట్ తర్వాత స్వదేశానికి తిరిగి రావడంతో, గాయాలతో సతమతమవుతున్న జట్టుకు రహానె నాయకత్వం వహించాడు. అడిలైడ్‌లో ఘోర పరాజయం తర్వాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ విన్నింగ్ సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. ఆ సిరీస్‌ను 2-1 తేడాతో గెలిపించి, భారత క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

"ప్రతిదానికీ ఒక ఆరంభం, ముగింపు ఉంటాయి. సమయం వచ్చినప్పుడు దాన్ని గౌరవించి ముందుకు సాగాలి. నేను నా బ్యాటింగ్‌లో టైమింగ్‌పైనే ఆధారపడ్డాను, దాని ప్రాముఖ్యత నాకు తెలుసు. ఇప్పుడు తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. అందుకే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నాను" అని రహానె తన వీడియోలో పేర్కొన్నాడు.

"ముంబైలోని డొంబివాలి నుంచి ప్రాక్టీస్ కోసం ప్రయాణించిన చిన్నప్పటి నుంచి ఈ ఆటకు నా సర్వస్వాన్ని ఇచ్చాను. దేశం కోసం, జట్టు కోసమే ఆడాలనే నియమంతోనే జీవించాను," అని రహానె తెలిపాడు. తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. "నా ప్రయాణం ముగిసినా, ఆటతో నా బంధం ముగియదు. తర్వాతి తరానికి మార్గనిర్దేశం చేస్తాను. అభిమానుల ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. క్యాప్ నంబర్ 278, సైనింగ్ ఆఫ్" అంటూ తన సందేశాన్ని ముగించాడు.

టీమిండియా త‌ర‌ఫున‌  రహానె కెరీర్ ఇలా..
రహానె తన అంతర్జాతీయ కెరీర్‌లో 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 8,000కు పైగా పరుగులు సాధించాడు. టెస్టుల్లో 12 సెంచరీలతో 5,077 పరుగులు చేశాడు. అందులో చాలా సెంచరీలు విదేశాల్లో, కఠినమైన పరిస్థితుల్లో చేసినవే కావడం విశేషం. 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత జట్టులో రహానె సభ్యుడిగా ఉన్నాడు. అదే ఏడాది జూలైలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టే అతనికి చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన అతను, రంజీ ట్రోఫీలో ఆడి పునరాగమనం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరకు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు.
Advertisement
Ajinkya Rahane
Ajinkya Rahane retirement
Indian cricket team
Border Gavaskar Trophy
Test cricket
Ajinkya Rahane career stats

More Telugu News