మేమేమైనా అంటరానివాళ్లమా?: చంద్రబాబుపై అంబటి ఫైర్
- తన పక్కన కూర్చున్నందుకు బొండా ఉమాకు నోటీసులు ఇచ్చారంటూ అంబటి ఫైర్
- పార్టీలు వేరైనా కాపు కార్యక్రమాల్లో నేతలు కలవడం సహజమని వ్యాఖ్య
- వయసు పెరుగుతున్న కొద్దీ చంద్రబాబుకు బుద్ధి తగ్గుతోందని విమర్శ
ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో తన పక్కన కూర్చున్నందుకు టీడీపీ నేత బొండా ఉమాకు ఆ పార్టీ అధిష్ఠానం నోటీసులు ఇవ్వడంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. పార్టీలు వేరైనా కాపు సామాజికవర్గ కార్యక్రమాల్లో నేతలు కలవడం సహజమని, అంతమాత్రానికే బొండా ఉమా నుంచి వివరణ కోరడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
తామిద్దరం పక్కపక్కనే కూర్చోవడం అంత పెద్ద తప్పా అని ప్రశ్నించిన అంబటి... తెలుగుదేశంలో ఉన్న కాపులతో తప్ప మిగిలిన కాపు నేతలతో ఎవరూ మాట్లాడకూడదని టీటీడీలో ఏదైనా ప్రత్యేక రూల్ ఉందా? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వయసు పెరుగుతున్న కొద్దీ చంద్రబాబుకు బుద్ధి తగ్గుతోందని, తమను అంటరానివారిగా భావిస్తున్నారా? అని నిలదీశారు. కాపు నేతల సభల్లో జనసేన, ఇతర పార్టీల నాయకులు కూడా కలుస్తుంటారని, అంతమాత్రాన అది తప్పైపోతుందా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో వర్షాల్లేక, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. వాటిపై దృష్టి పెట్టకుండా తన పక్కన బొండా ఉమా కూర్చోవడాన్నే చంద్రబాబు పెద్ద సమస్యగా మార్చారని అంబటి ఎద్దేవా చేశారు. ప్రత్యర్థి పార్టీల నేతలతో వేదికలు పంచుకోకూడదనే నెపంతో కాపు ఐక్యతను, నేతల మధ్య సంబంధాలను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.