కేంద్రానికి ఎల్‌ఐసీ భారీ కానుక.. రూ.12,207 కోట్ల డివిడెండ్‌

LIC MD R Doraiswamy presents dividend check to Nirmala Sitharaman
  • ఎల్‌ఐసీ నుంచి రూ.12,207 కోట్ల డివిడెండ్‌
  • యూనియన్‌ బ్యాంక్‌ నుంచి రూ.2,853 కోట్లు
  • న్యూ ఇండియా అష్యూరెన్స్‌ నుంచి రూ.211 కోట్లు
  • పీఎస్‌బీల జీఎన్‌పీఏ 1.9 శాతానికి తగ్గుదల
  • ఉమ్మడి నికర లాభం రూ.1.98 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి భారీగా డివిడెండ్లు అందుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ రూ.12,207 కోట్ల డివిడెండ్‌ను కేంద్రానికి అందించింది. అదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బీమా సంస్థల పనితీరు కూడా గణనీయంగా మెరుగుపడింది. మొండి బకాయిలు చారిత్రక కనిష్ఠానికి చేరగా, లాభాలు కొత్త రికార్డు నెలకొల్పాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్‌ఐసీ ఎండీ, సీఈఓ ఆర్‌. దొరైస్వామి రూ.12,207 కోట్ల డివిడెండ్‌ చెక్కును బుధవారం అందజేశారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. అలాగే యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ, సీఈఓ అశీష్‌ పాండే రూ.2,853 కోట్ల డివిడెండ్‌ చెక్కును అందించారు. న్యూ ఇండియా అష్యూరెన్స్‌ సీఎండీ గిరిజా సుబ్రహ్మణియన్‌ రూ.211 కోట్ల డివిడెండ్‌ను అందజేశారు. ప్రభుత్వ రంగ సంస్థల బలమైన ఆర్థిక పనితీరుకు ఇవి నిదర్శనమని ప్రభుత్వం పేర్కొంది.

ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక స్థితిపై కూడా కేంద్రం వివరాలు వెల్లడించింది. 2025-26లో ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 1.9 శాతానికి పడిపోయింది. ఇది ఇప్పటివరకు నమోదైన కనిష్ఠ స్థాయి. మరోవైపు ఈ బ్యాంకుల ఉమ్మడి నికర లాభం రూ.1.98 లక్షల కోట్లకు చేరింది. వరుసగా నాలుగో ఏడాది లాభాలను నమోదు చేయడం విశేషం. సంస్కరణలు, మెరుగైన పాలన, బలమైన మూలధన స్థితి ఈ ఫలితాలకు ప్రధాన కారణాలుగా ప్రభుత్వం పేర్కొంది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 2025-26లో ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం ఏడాది ప్రాతిపదికన 11.1 శాతం పెరిగింది. రుణాల వృద్ధి, వడ్డీ ఆదాయం పెరగడం, ఆస్తుల నాణ్యత మెరుగుపడటం లాభాలకు బలాన్నిచ్చాయి. 2026 మార్చి 31 నాటికి ఈ బ్యాంకుల మొత్తం వ్యాపారం రూ.283.3 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 12.8 శాతం వృద్ధిని నమోదు చేసింది.

మార్చి 31 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) నిష్పత్తి 0.39 శాతానికి తగ్గింది. ప్రతి ప్రభుత్వ రంగ బ్యాంకు 90 శాతానికి పైగా ప్రొవిజనింగ్‌ కవరేజ్‌ రేషియోను కొనసాగించింది. రుణాల మంజూరులో మెరుగైన ప్రమాణాలు, సమర్థమైన రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ బ్యాంకుల ఆర్థిక బలాన్ని మరింత పెంచాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Advertisement
LIC
Nirmala Sitharaman
Dividend
Public Sector Banks
Union Bank of India
Indian Government

More Telugu News