హైదరాబాద్-తిరుపతి ఫ్లైట్: గంట ప్రయాణానికి రూ. 24 వేల బాదుడు.. కార‌ణ‌మిదే!

Hyderabad Tirupati Flight Prices Reach 24000 For One Hour Travel Here Is The Reason
  • హైదరాబాద్ నుంచి తిరుపతికి విమాన చార్జీల మోత
  • శ్రీవాణి దర్శన టికెట్ల కోటాయే కారణమంటున్న నిపుణులు
  • చార్జీలు తగ్గించకపోతే ఎయిర్‌పోర్ట్ కౌంటర్ రద్దు చేస్తామని టీటీడీ హెచ్చరిక
  • విమానయాన సంస్థల తీరుపై తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆందోళన
తిరుమల శ్రీవారి దర్శనానికి హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లాలనుకునే భక్తులకు విమానయాన సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం గంట ప్రయాణానికి కొన్ని సందర్భాల్లో ఏకంగా రూ. 24 వేల వరకు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు భారీ చిల్లు పెడుతున్నాయి. ఈ మార్గంలో ఇండిగో, అలయన్స్ ఎయిర్, ఎయిర్ ఇండియా సంస్థలు సర్వీసులు నడుపుతుండగా, సాధారణ రోజుల్లోనే టికెట్ ధర రూ. 5,700 నుంచి రూ. 13,500 వరకు ఉంటోంది. చివరి నిమిషంలో బుక్ చేసుకుంటే ఈ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్ నుంచి సుదూర నగరాలైన ఢిల్లీ, ముంబైలకు రూ. 3,500 నుంచి రూ. 7 వేలకే టికెట్లు లభిస్తుండగా, తిరుపతికి మాత్రం ఈ స్థాయిలో చార్జీలు వసూలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శ్రీవాణి దర్శన టికెట్లే కారణమా?
ఈ భారీ ధరల పెరుగుదల వెనుక 'శ్రీవాణి వీఐపీ దర్శన కోటా' ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తిరుపతి ఎయిర్‌పోర్టులో విమాన ప్రయాణికుల కోసం టీటీడీ ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఏర్పాటు చేసి, రోజుకు సుమారు 200 శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను జారీ చేస్తోంది. చెల్లుబాటయ్యే బోర్డింగ్ పాస్ చూపిస్తే ముందు వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత పద్ధతిలో ఈ టికెట్లు కేటాయిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం పూట హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ టికెట్లు సులభంగా లభించే అవకాశం ఉండటంతో, దీన్ని ఆసరాగా చేసుకుని విమానయాన సంస్థలు ఆ సమయాల్లో నడిచే విమాన సర్వీసుల ధరలను అడ్డగోలుగా పెంచుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

రంగంలోకి దిగిన టీటీడీ, ఎంపీ
భక్తుల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తీవ్రంగా స్పందించారు. విమానయాన సంస్థలు చార్జీలను విపరీతంగా పెంచడం సరికాదని, భక్తుల విశ్వాసంతో ముడిపడిన ఈ విషయంలో వ్యాపార ధోరణి తగదని హితవు పలికారు. వెంటనే చార్జీలు తగ్గించకపోతే ఎయిర్‌పోర్టులోని శ్రీవాణి టికెట్ల జారీ కౌంటర్‌ను రద్దు చేసి, ఆ కోటాను ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ లేదా అడ్వాన్స్ బుకింగ్‌కు మార్చాల్సి వస్తుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

ఇదే విషయంపై తిరుపతి ఎంపీ, ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఎం. గురుమూర్తి సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపరీతమైన చార్జీలు భక్తులకు తీవ్ర భారంగా మారాయని, విమానయాన సంస్థలు తమ తీరు మార్చుకుని చార్జీల తగ్గింపుపై పునరాలోచన చేయాలని ఆయన కోరారు. టీటీడీ హెచ్చరికల నేపథ్యంలో విమానయాన సంస్థలు ధరలను తగ్గిస్తాయో? లేదో? వేచి చూడాలి.
Advertisement
Hyderabad Tirupati Flights
TTD
Srivani Darshan Tickets
Indigo Airlines
BR Naidu
Tirupati MP Gurumoorthy

More Telugu News