రష్యన్ చౌక ఆయిల్‌పై టారిఫ్‌లు?.. అమెరికా బిల్లుతో భారత్‌కు చిక్కులు!

Tariffs on cheap Russian oil US bill may cause trouble for India
  • రష్యాపై కఠిన ఆంక్షల కోసం అమెరికా సెనేట్‌లో కీలక బిల్లు
  • రష్యా నుంచి చమురు కొనే దేశాలపై 100 శాతం టారిఫ్‌లకు అవకాశం
  • భారీగా రష్యా చమురు కొంటున్న భారత్‌పై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్
  • ఇంకా చట్టంగా మారని బిల్లు.. తుది నిర్ణయం అధ్యక్షుడిదే
  • కొందరు చట్టసభ్యుల నుంచి వ్యతిరేకత.. బిల్లు భవిష్యత్తుపై అనిశ్చితి
రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా సెనేట్ కీలక అడుగులు వేస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై కఠిన ఆంక్షలు విధించేందుకు ఉద్దేశించిన ఒక బిల్లుపై ఓటింగ్ జరపనుంది. ఈ బిల్లు చట్టంగా మారితే, రష్యా నుంచి చౌకగా ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తున్న భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.

ఈ బిల్లు ప్రకారం, రష్యా నుంచి పెద్దమొత్తంలో చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లభిస్తుంది. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు ప్రధాన ఆదాయ వనరైన ఇంధన విక్రయాలను అడ్డుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ జాబితాలో భారత్, చైనా, జపాన్‌తో పాటు కొన్ని ఐరోపా దేశాలు కూడా ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్.. రష్యా నుంచి రాయితీ ధరలకు అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ బిల్లుకు 'లిండ్సే ఓ.గ్రాహమ్ సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026' అని పేరు పెట్టారు. ఇది కేవలం రష్యానే కాకుండా, ఇరాన్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంది. అమెరికా కాంగ్రెస్‌లో ఉక్రెయిన్‌కు గట్టి మద్దతుదారుగా నిలిచిన దివంగత సెనేటర్ లిండ్సే గ్రాహం అంత్యక్రియలు జరుగుతున్న రోజే ఈ ఓటింగ్ జరగడం గమనార్హం. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వాషింగ్టన్‌లో పర్యటిస్తున్నారు.

అయితే, ఈ బిల్లు చట్టంగా మారడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం సెనేట్‌లో జరుగుతున్నది కేవలం ఒక ప్రక్రియపరమైన ఓటింగ్ మాత్రమే. ఇది సెనేట్‌తో పాటు ప్రతినిధుల సభలోనూ ఆమోదం పొందిన తర్వాతే అధ్యక్షుడు ట్రంప్ వద్దకు వెళ్తుంది. ఒకవేళ చట్టంగా మారినా, టారిఫ్‌ల విధింపు వెంటనే జరగదు. వాటిని ఎప్పుడు, ఎవరిపై విధించాలనే విచక్షణాధికారం అధ్యక్షుడికే ఉంటుంది.

ఈ బిల్లుకు ఇరాన్‌పై ఆంక్షలను జోడించడంతో అధ్యక్షుడు ట్రంప్ మద్దతు తెలిపారు. కానీ, కొందరు డెమోక్రటిక్ చట్టసభ్యులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రాయిటర్స్ పేర్కొంది. ఈ బిల్లు అధ్యక్షుడికి అపరిమిత టారిఫ్ అధికారాలను కట్టబెడుతుందని, ఇది మిత్రదేశాలను సైతం ప్రభావితం చేయవచ్చని, అమెరికా వినియోగదారులపై భారం పడుతుందని వారు వాదిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ బిల్లు ప్రాథమిక దశలోనే ఉంది. దీని భవిష్యత్తు ప్రభావం కాంగ్రెస్ ఆమోదం, అమెరికా ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
Advertisement
Donald Trump
Russian Oil
India Russia Oil Trade
US Sanctions Bill
Lindsey Graham Act
Ukraine Russia War

More Telugu News