మంత్రి పదవికి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలి: రోజా

Roja demands Nara Lokesh resign as minister immediately
  • డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న రోజా
  • 427 మందికి అక్రమంగా పోస్టులు కట్టబెట్టారని ఆరోపణ
  • లోకేశ్ రాజీనామా చేసేంత వరకు పోరాటం ఆగదని వ్యాఖ్య

డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల నిర్వహణలో భారీగా అక్రమాలు, కుంభకోణం జరిగాయంటూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పై నిప్పులు చెరిగారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెకండ్ గేట్ వద్ద వైసీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో రోజా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరు చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తూ దీనిని ‘దగా డీఎస్సీ’గా మార్చేసిందని ఆమె ఆరోపించారు.


జీవో 420 జారీ చేసి అర్హత లేని దాదాపు 427 మందికి అక్రమంగా పోస్టులు కట్టబెట్టారని, పరీక్షల నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరిగాయని రోజా విమర్శించారు. డీఎస్సీ స్కామ్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేశ్ తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోకేశ్ దిగిపోయే వరకు తమ పోరాటం ఆగేది లేదని హెచ్చరించారు.


రూ. 7 వేల కోట్ల బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని రోజా ధ్వజమెత్తారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే బొండా ఉమ మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం కేవలం తమ అనుకూల ప్రచార పత్రికలను కాపాడుకోవడంలో మునిగి తేలుతోందే తప్ప... మహిళల రక్షణను, నిరుద్యోగుల భవిష్యత్తును పూర్తిగా గాలికొదిలేసిందని మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisement
RK Roja
Nara Lokesh
Mega DSC Scam
Andhra Pradesh Education Minister
YSRCP Protest Tirupati
Teacher Recruitment Irregularities

More Telugu News