జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజును పరామర్శించనున్న జగన్
- అంపోలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సీదిరి అప్పలరాజు
- ఎల్లుండి ములాఖత్ ద్వారా పరామర్శించనున్న జగన్
- అప్పలరాజు కుటుంబ సభ్యులను కలవనున్న వైసీపీ అధినేత
వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 30 (గురువారం)న ఆయన శ్రీకాకుళం వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అంపోలు జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజును జగన్ ములాఖత్ ద్వారా పరామర్శించనున్నారు.
ఇటీవల జరిగిన ఒక బైక్ ప్రమాదంలో (అప్పలరాజు కుమారుడి కేసు) ఒక వ్యక్తి మృతి చెందిన ఘటనకు సంబంధించి, దర్యాప్తును పక్కదోవ పట్టించారనే ఆరోపణలతో అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసును కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కుట్రపూరితంగా నమోదు చేసిందని వైసీపీ ఖండిస్తోంది. ఒక సాధారణ రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి, అప్పలరాజును ఏ3గా చేర్చడం వెనుక పెద్ద కుట్ర ఉందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ పర్యటన ద్వారా సీదిరి అప్పలరాజుకు, ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ పూర్తి అండగా ఉంటుందనే భరోసానివ్వడమే కాకుండా, పార్టీ కేడర్‌లో ధైర్యాన్ని నింపడమే జగన్ పర్యటన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. సీదిరి అప్పలరాజును పరామర్శించిన అనంతరం జగన్ ఆయన కుటుంబ సభ్యులతో కూడా భేటీ కానున్నారు.