చైనా చిప్ మేకర్ బంపర్ లిస్టింగ్... తొలిరోజే ఇన్వెస్టర్లకు 500 శాతానికి పైగా లాభాలు!

చైనా చిప్ మేకర్ బంపర్ లిస్టింగ్... తొలిరోజే ఇన్వెస్టర్లకు 500 శాతానికి పైగా లాభాలు!

CXMT Corp bumper listing China chip maker gives over 500 percent profit on first day
  • షాంఘై మార్కెట్లో చైనా చిప్ మేకర్ సీఎక్స్‌ఎంటీ సంచలనం
  • తొలిరోజు ట్రేడింగ్‌లోనే భారీగా పెరిగిన షేర్ల విలువ
  • చైనాలోనే అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా ఆవిర్భావం
చైనాకు చెందిన మెమొరీ చిప్ తయారీ దిగ్గజం సీఎక్స్‌ఎంటీ కార్ప్ స్టాక్ మార్కెట్లో నూతన చరిత్ర సృష్టించింది. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సోమవారం ట్రేడింగ్ ప్రారంభిమైన తొలిరోజే ఈ కంపెనీ షేర్లు 500 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసి ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేశాయి. ఈ అనూహ్యమైన పెరుగుదలతో, చైనాలోనే అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా సీఎక్స్‌ఎంటీ అవతరించింది.

ఈ ఐపీఓలో ఒక్కో షేరు ధరను 8.66 యువాన్‌లుగా నిర్ణయించగా, మార్కెట్లో 49.50 యువాన్‌ల వద్ద లిస్ట్ అయింది. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో షేరు విలువ ఏకంగా 55 యువాన్‌ల స్థాయికి చేరుకుంది. ఈ భారీ ర్యాలీ ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ సుమారు 3.56 ట్రిలియన్ యువాన్‌లకు పెరిగింది. తద్వారా, ఇప్పటివరకు దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా ఉన్న ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ)ను సీఎక్స్ఎంటీ అధిగమించింది.

ఈ ఏడాది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన సీఎక్స్‌ఎంటీ, పబ్లిక్ ఇష్యూ ద్వారా 57.9 బిలియన్ యువాన్‌లను సమీకరించింది. డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ (డీఆర్ఏఎం) చిప్‌ల తయారీలో చైనాలోనే అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ, అంతర్జాతీయంగా నాలుగో అతిపెద్ద తయారీదారుగా గుర్తింపు పొందింది. ఈ చిప్‌లను ప్రధానంగా స్మార్ట్‌ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్లు, ఏఐ డేటా సెంటర్లలో విస్తృతంగా వినియోగిస్తారు.

అమెరికా విధిస్తున్న టెక్నాలజీ ఆంక్షల నడుమ, సెమీకండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న చైనా ఆకాంక్షలకు ఈ ఐపీఓ నిధులు వెన్నుముకగా నిలవనున్నాయి. సేకరించిన నిధులను ఉత్పత్తి సామర్థ్యం పెంపుతో పాటు పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Advertisement
CXMT Corp
China chip maker
Shanghai Stock Exchange
Asia largest IPO
DRAM chip manufacturing

More Telugu News