Advertisement

డిమాండ్లను అంగీకరించిన కేంద్రం... నిరసన విరమించిన కాక్రోచ్ జనతా పార్టీ

Cockroach Janata Party ends protest as Center accepts demands
  • ప్రధాన డిమాండ్లకు కేంద్రం అంగీకరించడంతో నిరసన విరమించిన సీజేపీ
  • నీట్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
  • విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని ప్రభుత్వం హామీ
  • 36 రోజుల పాటు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొనసాగిన ఆందోళన
  • కేంద్ర మంత్రులు, సీజేపీ నేతల సంయుక్త మీడియా సమావేశంలో ప్రకటన
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో గత కొన్ని వారాలుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తమ నిరసనను విరమించింది. తమ ప్రధాన డిమాండ్ అయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు, ఇతర డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రులు, సీజేపీ ప్రతినిధులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం... కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ లతో సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా మరో దఫా చర్చలు జరిపారు. చర్చలు ముగిసిన అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించిందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందన్న సద్భావనతో నిరసనను తక్షణమే విరమిస్తున్నట్లు వారు తెలిపారు. తమ మద్దతుదారులంతా శాంతియుతంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలని పిలుపునిచ్చారు.

మంత్రి రాజీనామాతో పాటు, ప్రభుత్వం మరికొన్ని కీలక హామీలు ఇచ్చినట్లు సీజేపీ నేతలు వెల్లడించారు. నీట్ ఆందోళనల సందర్భంగా విద్యార్థులపై నమోదు చేసిన పోలీసు కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. అలాగే, నీట్ వ్యవహారంలో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం గరిష్ఠ పరిహారం అందజేస్తామని స్పష్టం చేసిందని వివరించారు.

ఈ సందర్భంగా సౌరవ్ దాస్ మాట్లాడుతూ, "ప్రభుత్వం మా డిమాండ్లను అంగీకరించింది. కాబట్టి ఆందోళన చేస్తున్న వారందరూ తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరుతున్నాం" అని అన్నారు. అశుతోష్ రంకా మాట్లాడుతూ, "36 రోజుల నిరసన తర్వాత ప్రభుత్వం దిగివచ్చింది. మా డిమాండ్లు తీవ్రమైనవి కావు, చాలా సాధారణమైనవి. ఇప్పుడు ప్రభుత్వం వాటిని ఆమోదించింది" అని పేర్కొన్నారు.
Advertisement
Cockroach Janata Party
NEET paper leak protest
Dharmendra Pradhan resignation
Jantar Mantar Delhi
Student police cases withdrawal
CJP protest ends

More Telugu News