ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుప‌త్రి సిబ్బంది, పోలీసులు తనను గంటల తరబడి అక్రమంగా అడ్డుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తనను గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుప‌త్రికి తరలించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని అమలు చేయకుండా తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియోను ఆయన నిన్న‌ రాత్రి తన యూట్యూబ్ ఖాతాలో విడుదల చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

నేపథ్యం ఏమిటి? 
'కాక్‌రోచ్ జనతా పార్టీ' (సీజేపీ)కి మద్దతుగా వాంగ్‌చుక్ జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్య సలహాలు మరియు హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు జులై 18న ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుప‌త్రికి తరలించారు. అనంతరం జులై 21న హైకోర్టు ఆయనను ప్రైవేట్ ఆసుప‌త్రి అయిన మేదాంతకు తరలించడానికి అనుమతి ఇచ్చింది.

వీడియోలో ఏముంది? 
ఆసుప‌త్రి నుంచి బయటకు వెళ్లకుండా తనను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ వాంగ్‌చుక్ ఒక భద్రతా సిబ్బందితో వాదిస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. "నన్ను అరెస్టు చేయమని వారికి చెప్పండి. నేను స్వేచ్ఛా పౌరుడిని" అని ఆయన పోలీసులతో అన్నారు. "నా నిరాహార దీక్ష 25వ రోజున మీరు నన్ను మూడు గంటల పాటు నిర్బంధించారు. ఈ ఒత్తిడితో నేను చనిపోతే మీదే బాధ్యత" అని హెచ్చరించారు. 

ఈ సమయంలో ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వాంగ్‌చుక్ ఆసుప‌త్రి సిబ్బందిలో ఒకరిని ఉద్దేశించి.. 'మీరు డాక్టరా లేక కసాయివాడివా?' అని ప్రశ్నిస్తూ, నిరసనగా ఆసుప‌త్రి ఫ్లోర్‌పై పడుకున్నారు. హైకోర్టు ఉత్తర్వులు తమకు అందలేదని సిబ్బంది చెప్పగా.. "ప్రపంచం మొత్తానికీ డిజిటల్‌గా ఆ విషయం తెలుసు.. మీకు తప్ప" అని వాంగ్‌చుక్ తీవ్రంగా స్పందించారు.

వాంగ్‌చుక్ వాదన 
మేదాంత ఆసుప‌త్రి బెడ్‌పై నుంచి రికార్డ్ చేసిన మరో వీడియోలో వాంగ్‌చుక్ తన వాదనను మరింత స్పష్టంగా వినిపించారు. "హైకోర్టు ఉత్తర్వులు మధ్యాహ్నం 2 గంటలకే వచ్చి ఉండవచ్చు. కానీ, నేను బయటకు వెళ్లకుండా ఉండేందుకు రాత్రి 7 గంటల వరకు వాటిని నాకు ఇవ్వలేదు. వారి ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు. మూడు గంటల పాటు మమ్మల్ని నిలిపివేశారు. శారీరకంగా పోరాటం చేయాల్సి వచ్చింది" అని ఆయన వివరించారు.

సఫ్దర్‌జంగ్ ఆసుప‌త్రి స్పందన 
ఈ ఆరోపణలపై సఫ్దర్‌జంగ్ ఆసుప‌త్రి యాజమాన్యం స్పందించింది. వాంగ్‌చుక్ సహాయకులు ఈ వీడియోను ఆసుపత్రిలోని 'నో-వీడియోగ్రఫీ' జోన్‌లో చిత్రీకరించారని పేర్కొంది. "హైకోర్టు రాతపూర్వక ఆదేశాలు మాకు అందకముందే ఈ వీడియో రికార్డ్ చేశారు. ఆ సమయంలో, మీడియాలో వస్తున్న సమాచారం ఆధారంగా వాంగ్‌చుక్ ఆసుప‌త్రి నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టారు. నిబంధనల ప్రకారం, రాతపూర్వక ఉత్తర్వులు అందిన వెంటనే, అదే రోజు సాయంత్రం 6:40 గంటలకు వాంగ్‌చుక్‌ను మేదాంత వైద్య బృందానికి అప్పగించాం" అని ఆసుప‌త్రి ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రస్తుతం వాంగ్‌చుక్ మేదాంతలో చికిత్స పొందుతుండగా, ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, వాంగ్‌చుక్ నిన్న దీక్ష విరమించిన సంగతి తెలిసిందే. ప్రధాని హామీతో 26 రోజుల దీక్షకు ఆయన శుక్రవారం నాడు ముగింపు పలికారు.