ఆందోళన మధ్యలో బర్గర్.. పదవి కోల్పోయిన కాక్‌రోచ్ పార్టీ నేత.. ఆకలేస్తే తినొద్దా అంటూ ప్రశ్న

Vijeta Dahiya loses CJP post after burger video goes viral during protest
  • పార్లమెంట్ మార్చ్ వేళ బర్గర్ తింటూ దొరికిన సీజేపీ నేత
  • విజేత దహియాను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించిన పార్టీ
  • ఇదంతా తనపై జరుగుతున్న కుట్రపూరిత ప్రచారమన్న విజేత
  • ఆకలేస్తే తినడంలో తప్పేముందని ప్రశ్నించిన దహియా
  • ఉద్యమం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని వెల్లడి
విద్యార్థుల నిరసన తీవ్రస్థాయిలో కొనసాగుతుండగా, మధ్యలో బర్గర్ తింటూ కనిపించిన వీడియో వైరల్ కావడంతో 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) తన అధికార ప్రతినిధి విజేత దహియాను పదవి నుంచి తొలగించింది. ఈ చర్యపై స్పందించిన దహియా, తనపై జరుగుతున్నది కేవలం కుట్రపూరిత ప్రచారమేనని, ఉద్యమానికి తాను చేసిన సేవ గురించి అందరికీ తెలుసని అన్నారు.

నీట్ పేపర్ లీక్, ఇతర పరీక్షల్లో అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు, యువత సోమవారం 'చలో పార్లమెంట్' కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో నిరసనకారులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘర్షణల్లో 118 మంది పోలీసులు, 60 మంది నిరసనకారులు సహా మొత్తం 178 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కీలకమైన సమయంలో దహియా బర్గర్ తింటున్న వీడియో బయటకు వచ్చి తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఈ పరిణామాలపై 'ఎన్డీటీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజేత దహియా తన వాదన వినిపించారు. "ఈ ఉద్యమం కోసం నేను నా చెమట, రక్తాన్ని ధారపోశానని ప్రతి నిరసనకారుడికి తెలుసు. 12 గంటల పాటు నిలబడి పనిచేశాను. మార్చ్ ముగిశాక, సాయంత్రం మళ్లీ రావాలనే ఉద్దేశంతో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాను. ఇది నిరసనకారులకు సంబంధించిన విషయం కాదు, కేవలం నాపై జరుగుతున్న ప్రచారం" అని ఆయన వివరించారు.

మరోవైపు సీజేపీ ఒక ప్రకటనలో దహియా చర్యలను తీవ్రంగా ఖండించింది. నిరసన సమయంలో ఆయన 'తీవ్రమైన సున్నితత్వం లేని చర్య' ఆమోదయోగ్యం కాదని, ఇది తమ ఉద్యమ విలువలకు, సూత్రాలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొంటూ అతడిని అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించింది. పార్టీ నిర్ణయంపై దహియా స్పందిస్తూ.. "ఒక త్యాగం చేయడం వల్ల ఉద్యమం బలపడితే, దానికి నేను సిద్ధం. విజేత అంత ముఖ్యం కాదు. ఉద్యమం, దాని లక్ష్యం ముఖ్యం. కాబట్టి నాకు ఎలాంటి సమస్య లేదు" అని అన్నారు.

బర్గర్ తిన్న వీడియోపై స్పందిస్తూ.. "చూడండి.. ఎవరికైనా ఆకలేస్తే తింటారు. తినడంలో తప్పు లేదు కదా? నేను ఆకలిని త‌ట్టుకునే వ్యక్తిని కాదు. చాలా సేపటి నుంచి ఏమీ తినకుండా ఆకలితో ఉంటే బర్గర్ తిన్నాను. దీనికోసం నన్ను లక్ష్యంగా చేసుకోవడం సరికాదు" అని దహియా పేర్కొన్నారు. 

ర్యాలీకి నాయకత్వం లేదన్న ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు. పార్టీకి చెందిన మరో ఇద్దరు అధికార ప్రతినిధులు ప్రభుత్వ ప్రతినిధితో సమావేశానికి వెళ్లారని, ఆ సమయంలో నిరసనకారులు అసహనానికి గురవ్వడంతో తాము మార్చ్ ప్రారంభించాల్సి వచ్చిందని చెప్పారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో తమ నేతలు సమావేశమై డిమాండ్లతో కూడిన లేఖను అందజేశారని సీజేపీ ధ్రువీకరించింది.
Advertisement
Vijeta Dahiya
Cockroach Janata Party
NEET Paper Leak Protest
Burger Viral Video
Chalo Parliament Delhi
Dharmendra Pradhan Resignation

More Telugu News