ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్.. దావోస్ ఒప్పందానికి కీలక ముందడుగు

UAE Food Cluster in AP A Key Step Forward for Davos Agreement
  • దావోస్‌లో కుదిరిన ఒప్పందానికి కార్యరూపం 
  • ముఖ్యమంత్రి చంద్రబాబుతో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ భేటీ
  • మామిడి, అరటి వంటి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పనే లక్ష్యం
  • ఏపీ ప్రభుత్వం, యూఏఈ మధ్య కుదిరిన కీలక భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కుదిరిన మరో కీలక ఒప్పందం కార్యరూపం దాల్చే దిశగా ముందడుగు పడింది. రాష్ట్రంలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది.

ఈ ఏడాది దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిపిన చర్చల సందర్భంగా ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యూఏఈ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ ఒప్పందాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో భాగంగా యూఏఈ ప్రతినిధులు అమరావతికి వచ్చారు. ఆహార శుద్ధి రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక పూర్తిస్థాయి వ్యాల్యూచైన్ ఏర్పాటు చేయాలని యూఏఈ నిర్ణయించింది. దీనికోసం ఏపీ ప్రభుత్వం, యూఏఈ మధ్య అధికారికంగా భాగస్వామ్యం కుదిరింది.

ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలో అధికంగా పండే మామిడి, అరటి, కోకో వంటి ఉద్యాన ఉత్పత్తులను శుద్ధి చేసి, నాణ్యతా ప్రమాణాలతో ప్యాక్ చేసి, అంతర్జాతీయ మార్కెట్లకు తరలించేందుకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇది రాష్ట్రంలోని రైతులకు మేలు చేయడంతో పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కీలక సమావేశంలో యూఏఈ ప్రతినిధులతో పాటు రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులు, ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఈడీబీ) అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
UAE Food Cluster Andhra Pradesh
Abdulla bin Touq Al Marri
Davos WEF Agreement AP
Food Processing Industry Andhra Pradesh
AP UAE Investment Partnership

More Telugu News