నకిలీ వజ్రంతో అసలుది మార్చే ప్లాన్.. సింగపూర్‌లో ఇద్ద‌రు భారతీయుల నిర్వాకం.. చివ‌రికి!

Plan to swap real diamond with fake two Indians arrested in Singapore
  • సింగపూర్‌లో వజ్రం దొంగతనం కేసులో భారతీయుడికి జైలు
  • నకిలీ డైమండ్‌ ఇచ్చి అసలుది కొట్టేయాలని పక్కా ప్లాన్
  • ఒకరు సిబ్బందిని పక్కకు తిప్పగా, మరొకరు నోట్లో దాచిన‌ వజ్రాన్ని మార్చిన వైనం
  • దేశం విడిచి పారిపోతుండగా ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్
  • ఈ శుక్రవారం జరగనున్న‌ మరో నిందితుడి కేసు విచారణ
సింగపూర్‌లోని ఓ జ్యువెలరీలో సుమారు 2 లక్షల సింగపూర్ డాలర్ల (దాదాపు రూ.1.48 కోట్లు) విలువైన వజ్రాన్ని దొంగిలించడానికి పక్కా ప్రణాళికతో వెళ్లిన ఇద్దరు భారతీయుల్లో ఒకరికి అక్కడి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో నిందితుడైన మంగ్రోలియా మనోజ్‌కుమార్ కుర్జిభాయ్ (41) తన నేరాన్ని అంగీకరించడంతో అతనికి రెండు సంవత్సరాల రెండు నెలల రెండు వారాల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల‌ 17న తీర్పు వెలువడింది. మరో నిందితుడు సెరాసియా మిలన్ రామ్నిక్‌భాయ్ (30) కేసు విచారణ ఈ శుక్రవారం జరగనుంది.

వివరాల్లోకి వెళితే.. వీరిద్దరూ ఈ వజ్రాన్ని ఎలా దొంగిలించాలో భారత్‌లోనే పథకం రచించారు. సూరత్‌లో ప్రత్యేకంగా ఆ వజ్రం స్పెసిఫికేషన్లు, సీరియల్ నంబర్‌తో సరిగ్గా సరిపోయేలా ఒక నకిలీ వజ్రాన్ని తయారు చేయించుకున్నారు. అనంతరం సోషల్ పాస్‌లపై జూన్ 19న సింగపూర్ చేరుకున్నారు. చైనాటౌన్‌లోని డియానోచే అనే జ్యువెలరీలోకి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రవేశించి, 4.95 క్యారెట్ల వజ్రాన్ని చూడాలని కోరారు.

ప్లాన్ ప్రకారం మంగ్రోలియా మనోజ్‌కుమార్ దుకాణంలోని సేల్స్ మేనేజర్‌ను ఇతర ఆభరణాలు చూపిస్తూ మాటల్లో పెట్టాడు. అదే సమయంలో సెరాసియా మిలన్ తన నోట్లో దాచుకున్న నకిలీ వజ్రాన్ని బయటకు తీసి, అసలు వజ్రం స్థానంలో పెట్టి, నిజమైన వజ్రాన్ని నోట్లో దాచుకున్నాడు. అయితే, వారి చర్యలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కొద్దిసేపటి తర్వాత కొనుగోలు విషయం ఆలోచించి చెబుతామని చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన సేల్స్ మేనేజర్, ఆప్టికల్ జెమ్‌స్టోన్ ఐడెంటిఫికేషన్ మెషీన్‌తో వజ్రాన్ని పరీక్షించగా అది నకిలీదని తేలింది. మరోవైపు ఈ ఇద్దరూ తాము బస చేస్తున్న హోటల్ నుంచి ముందుగానే చెక్-అవుట్ చేసి, అదే రోజు రాత్రి భారత్‌కు విమానం బుక్ చేసుకున్నారు. అయితే, వారు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా, చాంగీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 వద్ద ఇమ్మిగ్రేషన్ క్లియర్ చేస్తుండగా రాత్రి 8:50 గంటలకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అసలు వజ్రాన్ని మిలన్ హ్యావర్‌సాక్‌లో స్వాధీనం చేసుకున్నారు.

విచారణ సందర్భంగా కేవలం ఈ నేరం కోసమే వారు సింగపూర్ వచ్చినందున, ఇది ప్రణాళికాబద్ధమైన నేరమని ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తక్కువ శిక్ష విధించాలని మంగ్రోలియా కోర్టును అభ్యర్థించాడు. వాదనలు విన్న న్యాయస్థానం, అతనికి జైలు శిక్ష ఖరారు చేసింది.
Advertisement
Mangroliya Manojkumar Kurjibhai
Singapore diamond theft
Indian nationals arrested in Singapore
Fake diamond swap case
Dianoce jewelry store Singapore
Surat diamond robbery plan

More Telugu News