మళ్లీ ఢిల్లీ బాట పట్టిన రైతులు.. శంభూ సరిహద్దులో అడ్డుకున్న పోలీసులు

Farmers protest against India US trade deal at Shambhu border
  • ఇప్పటికే ఢిల్లీలో కొనసాగుతున్న సీజేపీ ఆందోళనలు
  • పంజాబ్‌ నుంచి ఢిల్లీ బయలురేరిన రైతులు
  • శంభూ వద్ద అడ్డుకున్న పోలీసులు
  • అక్కడే బైఠాయించి నిరసన చేపట్టిన అన్నదాతలు
  • భారత్-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై వ్యతిరేకత
  • ఈ ఒప్పందంతో రైతులు నష్టపోతారని ఆందోళన
ఇప్పటికే కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు, ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. ఈ తరుణంలో పంజాబ్‌ నుంచి వందలాది మంది రైతులు ఢిల్లీ దిశగా రావడం కలకలం రేకెత్తించింది. దీంతో వారిని నగర సరిహద్దుల్లో శంభూ వద్ద హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. వారు అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టారు. భారత్-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నిర్వహించనున్న ‘కిసాన్ మహాపంచాయత్’లో పాల్గొనేందుకు వారు ఢిల్లీకి బయలుదేరారు.

తమను ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని రైతు సంఘాలు మండిపడ్డాయి. హర్యానా పోలీసులు పంజాబ్ భూభాగంలోనే బారికేడ్లు ఏర్పాటు చేశారని, దీనిపై పంజాబ్ ప్రభుత్వం కూడా మౌనం పాటిస్తోందని బీకేయూ షహీద్ భగత్ సింగ్ నేత తేజ్‌వీర్ సింగ్ ఆరోపించారు. మరోవైపు హర్యానాలోని అంబాలా, కురుక్షేత్ర తదితర ప్రాంతాల రైతులు మాత్రం ఢిల్లీకి చేరుకున్నారు.

అమెరికాతో కుదుర్చుకోనున్న వాణిజ్య ఒప్పందం వల్ల భారత వ్యవసాయం, పాడి పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా వ్యవసాయ, పాల ఉత్పత్తులకు భారత మార్కెట్‌ను తెరిస్తే కోట్లాది మంది చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించి, రైతులు, పాల ఉత్పత్తిదారులు, చిన్న వ్యాపారులతో సంప్రదింపులు జరపకుండానే ఎలాంటి ఒప్పందంపైనా సంతకం చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.
Advertisement
Farmers
Delhi Chalo Protest
Shambhu Border
Kisan Mahapanchayat
India US Trade Deal
Haryana Police

More Telugu News