ఆగస్టు 30లోగా తనిఖీలు పూర్తి కావాలి: బీసీ గురుకులాలపై మంత్రి పొన్నం ఆదేశాలు
- విద్యార్థులకు విద్యతో పాటు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమన్న పొన్నం
- ప్రతి ఆర్‌సీవో కచ్చితంగా వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశం
- తాను కూడా ప్రతి నెల కనీసం 15 గురుకులాల్లో తనిఖీలు నిర్వహిస్తానని వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ గురుకుల విద్యాసంస్థల నిర్వహణ, విద్యార్థుల వసతులపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కఠిన నిబంధనలు విధించారు. బీసీ గురుకుల రీజనల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్‌లతో (ఆర్‌సీవో) కీలకమైన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... రాబోయే ఆగస్టు 30వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని బీసీ గురుకుల విద్యాసంస్థల్లో క్షేత్రస్థాయి తనిఖీలను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన గడువు విధించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పూర్తి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ విధివిధానాల్లో భాగంగా ప్రతి ఆర్‌సీవో కచ్చితంగా వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి, కనీసం ఆరు గురుకుల విద్యాసంస్థలను నేరుగా సందర్శించాలని మంత్రి ఆదేశించారు. విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించిన ఆయన, స్వయంగా తాను కూడా ప్రతి నెలా కనీసం 15 గురుకులాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఎక్కడా ఫుడ్ పాయిజనింగ్ వంటి ఘటనలు జరగకుండా ఆహార నాణ్యతపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. చదువుతో పాటు క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యమిస్తూ, ఒత్తిడి తగ్గించేందుకు సైకాలజిస్టులతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు.
మరొక వైపు సొంత భవనాలు లేని గురుకులాలకు భూముల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మూసీ గురుకులానికి సొంత భవన నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలకు కేటాయించే నిధుల్లో ఆరు శాతాన్ని అత్యవసర మరమ్మతులకు వినియోగించుకునేలా అనుమతించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి గురుకులంలో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, విద్యార్థుల భాగస్వామ్యంతో విస్తృతంగా మొక్కలు నాటించి వాటిని సంరక్షించే బాధ్యతలను కూడా వారికి అప్పగించాలని ఆర్‌సీవోలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు.