కోహ్లీ మాటలు బాగా ప‌ని చేశాయి.. అవ‌స‌ర‌మైన‌ స‌మ‌యంలో నాకు అండ‌గా నిలిచాడు: పీవీ సింధు

PV Sindhu says Virat Kohli words worked well in difficult times and he stood by her
  • జపాన్ ఓపెన్ బీడ‌బ్ల్యూఎఫ్‌ సూపర్ 750 టైటిల్ గెలుచుకున్న పీవీ సింధు
  • 2019 తర్వాత సింధుకు ఇదే తొలి మేజర్ టైటిల్
  • విరాట్ కోహ్లీతో సంభాషణ ఆత్మవిశ్వాసం నింపిందని వెల్లడి
  • అవసరమైన సమయంలో కోహ్లీ త‌న‌కు అండగా నిలిచాడ‌న్న సింధు
  • అత‌డు చెప్పిన ప్రతి మాట త‌న‌ మదిలో నిలిచిపోయింద‌న్న స్టార్ షట్లర్
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మేజర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. జపాన్ ఓపెన్ బీడ‌బ్ల్యూఎఫ్‌ సూపర్ 750 టోర్నమెంట్‌లో చారిత్రక విజయం సాధించింది. ఫైనల్‌లో తన చిరకాల ప్రత్యర్థి, వరల్డ్ నంబర్ 3 క్రీడాకారిణి అకానే యమగూచిని చిత్తు చేసి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 21-17, 21-17 తేడాతో వరుస సెట్లలో గెలుపొందింది. ఈ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళగా సింధు చరిత్ర సృష్టించింది.

2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత సింధుకు ఇదే తొలి మేజర్ బీడ‌బ్ల్యూఎఫ్‌ టైటిల్ కావడం విశేషం. గత కొంతకాలంగా గాయాలు, ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న సింధు, ఈ విజయంతో ఘనంగా పునరాగమనం చేసింది. తనలో ఆత్మవిశ్వాసం నింపిన ఒక ఆసక్తికర విషయాన్ని సింధు పంచుకుంది. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో జరిపిన సంభాషణ తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని తెలిపింది.

"మా మధ్య ఏం జరిగిందనేది మా మధ్యే ఉంటుంది. కానీ అవసరమైన సమయంలో ఆయన నాకు అండగా నిలిచారు. ఆయన ఎక్కువగా మాట్లాడలేదు, కానీ చెప్పిన ప్రతి మాట నా మదిలో నిలిచిపోయింది. కొన్ని సంభాషణలు మన ఆలోచనా విధానాన్ని మారుస్తాయి. ఇది అలాంటిదే" అని సింధు వివరించింది. రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన ఏకైక భారత మహిళా షట్లర్‌గా రికార్డు ఉన్న సింధు, ఈ విజయంతో మళ్లీ గెలుపు బాట పట్టింది.
Advertisement
PV Sindhu
Virat Kohli
Japan Open 2024
Akane Yamaguchi
BWF Super 750
Indian Badminton

More Telugu News