వంటగదిలోకి రాబోతున్న ఇథనాల్ గ్యాస్.. ఎల్పీజీ స్థానంలో కొత్త కుకింగ్ ఫ్యూయల్!

Ethanol gas coming to kitchen new cooking fuel in place of LPG
  • ఎల్పీజీ కొరత, దిగుమతుల భారాన్ని తగ్గించే లక్ష్యం
  •  ఇథనాల్‌ను వంట ఇంధనంగా మార్చే యోచనలో కేంద్రం
  • పెట్రోల్లో ఈ-20 కలపగా, మిగిలే 700 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను వంటకు ఉపయోగించేలా ప్రణాళిక
  • దీనికోసం ప్రత్యేకంగా 'సూపర్ బ్లూ స్టవ్' 
  • పెట్రోల్ బంకుల కియోస్క్‌లలో లిక్విడ్ రూపంలో విక్రయం
  • సెప్టెంబరు నాటికి ఇథనాల్ కుకింగ్ ఫ్యూయల్ విధానం సిద్ధం!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ఎల్పీజీ దిగుమతులు భారంగా మారడంతో, గ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్‌ను వంట ఇంధనంగా (కుకింగ్ ఫ్యూయల్) ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ (ఈ-20) కలిపినప్పటికీ, దేశంలో మున్ముందు 700 కోట్ల లీటర్ల ఇథనాల్ మిగిలే అవకాశం ఉండటంతో దానిని వంటగదికి మళ్లించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన సమగ్ర విధానం సెప్టెంబరు నాటికి సిద్ధం కానుంది.

ఇథనాల్ వినియోగానికి ప్రస్తుత గ్యాస్ స్టవ్‌లు పనికిరావు. దీని కోసం 'సూపర్ బ్లూ స్టవ్' అనే ప్రత్యేక పరికరం అవసరం. లీటరు ఇథనాల్‌తో సుమారు 15 గంటల పాటు వంట చేసుకోవచ్చని, ఎల్పీజీ కన్నా ఇది చౌకగా లభిస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఎల్పీజీ తరహాలోనే ఈ స్టవ్‌లు, ఇథనాల్‌కు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే ఆలోచనలో ఉంది. అయితే ఇది సిలిండర్లలో రాదు, వినియోగదారులే బకెట్లు లేదా డబ్బాలు తీసుకెళ్లి పెట్రోల్ బంకులలోని ప్రత్యేక కియోస్క్‌లలో నింపుకోవాల్సి ఉంటుంది.

కాగా, పెట్రోల్లో ఇథనాల్ శాతాన్ని 20 దాటి పెంచే అంశంపై ఆయిల్, ఆటోమొబైల్ కంపెనీలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి సురేశ్ గోపి రాజ్యసభలో తెలిపారు. గత దశాబ్దకాలంలో ఇథనాల్ మిశ్రమం వల్ల రూ. 1.97 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని, రైతులు రూ. 1.66 లక్షల కోట్ల ఆదాయం పొందారని ఆయన చెప్పారు.
Advertisement
Ethanol
Cooking Fuel
Nitin Gadkari
LPG Alternative
Super Blue Stove
Ethanol Subsidy

More Telugu News