తనను గన్‌పాయింట్‌లో బెదిరించారన్న డీఎంకే ఎమ్మెల్యే .. తమిళ రాజకీయాల్లో మళ్లీ రగడ!

DMK MLA alleges gunpoint threat as Tamil Nadu politics heats up
  • డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్‌కు 14 రోజుల రిమాండ్
  • వైద్య పరీక్షల సమయంలో పోలీసులు తనను బెదిరించారన్న ఎమ్మెల్యే 
  • కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని స్టాలిన్ ధ్వజం
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌పై బెదిరింపు వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన విలాతికుళం డీఎంకే ఎమ్మెల్యే జి.వి.మార్కండేయన్ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు కస్టడీలో తనను కొట్టడానికి ప్రయత్నించారని, గన్‌పాయింట్‌లో పెట్టి బెదిరించారని ఆరోపించారు. జులై 18న కొవిల్‌పట్టి బహిరంగ సభలో "అసెంబ్లీని లాక్ చేస్తే ఎముకలు విరగ్గొట్టి పంపుతాం" అని సీఎంను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో, టీవీకే నేత ఫిర్యాదుతో పోలీసులు మార్కండేయన్‌ను అరెస్ట్ చేశారు.

10 గంటల విచారణ అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మీడియాతో మాట్లాడకుండా పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఆయన గట్టిగా అరుస్తూ.. "నా ప్రాణాలకు ప్రమాదం ఉంది, పోలీసులు నన్ను గన్‌పాయింట్‌లో బెదిరిస్తున్నారు" అని విలేకరులకు చెప్పారు.

ఈ పరిణామంపై డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయవాదిని కూడా కలవనివ్వకుండా ఎమ్మెల్యే హక్కులను కాలరాశారని, పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని హెచ్చరించారు.
Advertisement
GV Markandeyan
DMK MLA arrest
Joseph Vijay
MK Stalin
Tamil Nadu politics
Police gunpoint allegations

More Telugu News