పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న మాజీ స్పీకర్.. అర్ధరాత్రి కారులో తమ్మినేని కుటుంబం పరారీ!

Tammineni Sitaram former speaker escapes police in midnight car flee
  • రూ. 4 కోట్ల విలువైన భూమి కబ్జా కేసులో వైసీపీ నేత 
  • బతికున్న భూ యజమాని చనిపోయినట్లు నకిలీ పత్రాలు స్పష్టి
  • ఆపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు
  • ముఠాగా ఏర్పడి పదుల సంఖ్యలో దొంగ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తింపు
వైసీపీ సీనియర్ నేత, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన సుమారు రూ. 4 కోట్ల విలువైన భూకబ్జా కుట్ర కేసులో తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్‌ నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. అరెస్టు ఖాయమని తెలుసుకున్న తమ్మినేని కుటుంబం, సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆమదాలవలసలోని తమ అద్దె ఇల్లు వదిలి రహస్యంగా పరారయ్యారు. ఇంట్లో రెండు సొంత కార్లు ఉన్నప్పటికీ, అనుమానం రాకుండా ప్రైవేటు ఇన్నోవా కారును రప్పించి అందులో వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు తమ లొకేషన్‌ను ట్రాక్ చేయకుండా ఉండేందుకు ఫోన్లను కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

బతికున్న వ్యక్తిని చంపేసి అక్రమ రిజిస్ట్రేషన్
చాపురం పంచాయతీ బలగ పరిధిలో ఉన్న భూ యజమాని బతికుండగానే, ఆయన చనిపోయినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. ఆ తర్వాత ఒడిశాకు చెందిన ఒక మహిళను ఏకైక వారసురాలిగా తెరపైకి తెచ్చి, ఆ స్థలాన్ని తమ్మినేని సీతారాం కుమారుడి పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ దందాను పోలీసులు ఆదివారం బయటపెట్టారు. ఈ కుట్రలో భాగమైన 13 మంది నిందితుల్లో హిరమండలం సబ్‌రిజిస్ట్రార్ సహా 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అయితే కళ్లెదుటే ఉన్న తమ్మినేని కుటుంబాన్ని అరెస్టు చేయకుండా పోలీసులు కాలయాపన చేశారని, ఆ జాప్యం వల్లే వారు న్యాయసలహాలు తీసుకుంటూ పరారయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 అక్రమ రిజిస్ట్రేషన్ల పుట్ట
మాజీ హోంగార్డు త్రినాథ్, తెలుగు సతీష్ కుమార్, రజని తదితరులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ పత్రాలతో పదుల సంఖ్యలో దొంగ రిజిస్ట్రేషన్లు చేసినట్లు విచారణలో తేలింది. వైసీపీ హయాంలో స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు తమ్మినేని కొనుగోలు చేసిన భూముల్లో ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు ఇంకెన్ని ఉన్నాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదిలా ఉండగా, తమ్మినేనిపై గతంలోనూ పలు భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. ఆమదాలవలస టీఎస్ఆర్ కళాశాల పక్కన ఉన్న 8 సెంట్ల స్థలాన్ని ఆక్రమించగా, ఇటీవల అధికారులు బాధితులకు అప్పగించారు. టెక్కలి మండలం చింతామణి గ్రామంలో 23 ఎకరాల భూమిని బెదిరించి తన కుమారుడి పేరిట రాయించుకున్నారని, అలాగే ఒక మృతుడి కుటుంబానికి చెందిన ఇల్లును, ఓ కానిస్టేబుల్ భార్యను బెదిరించి రైల్వేస్టేషన్ సమీపంలోని ఇల్లును తమ్మినేని కుటుంబం ఆక్రమించుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు, పరారీలో ఉన్న తమ్మినేని కుటుంబం కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు.
Advertisement
Tammineni Sitaram
Land Grabbing Case
Srikakulam News
YSRCP Leader
Former Speaker Absconding
Fake Document Registration

More Telugu News