ఫైర్‌బ్రాండ్ అధికారి తుకారాం ముండేతో కాజల్ అగర్వాల్ భేటీ

Kajal Aggarwal meets straightforward officer Tukaram Mundhe
  • ఐఏఎస్ అధికారి తుకారాం ముండేను కలిసిన కాజల్ అగర్వాల్ 
  • నిజాయతీ అసాధారణంగా మారిందన్న ఆయన మాటలు ఆలోచింపజేశాయన్న నటి
  • మహారాష్ట్రలో ఫుడ్ సేఫ్టీ అధికారిగా కఠిన చర్యలు తీసుకుంటున్న తుకారాం
  • తన కొత్త సినిమా 'ది ఇండియా స్టోరీ' కథ కూడా ఇదేనని వెల్లడి
ప్రముఖ నటి కాజల్ అగర్వాల్, తన కొత్త చిత్రం ‘ది ఇండియా స్టోరీ’ విడుదల సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆమె మహారాష్ట్రలో ఫుడ్ సేఫ్టీ అధికారిగా కఠిన చర్యలతో వార్తల్లో నిలుస్తున్న ఫైర్‌బ్రాండ్ ఐఏఎస్ అధికారి తుకారాం ముండేను కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోను, తన అనుభవాలను సోమవారం ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

తుకారాం ముండే నిజాయతీ, చిత్తశుద్ధిని తాను ఎప్పటినుంచో ఆరాధిస్తున్నానని కాజల్ తెలిపారు. ఇదే విషయాన్ని ఆయనతో చెప్పినప్పుడు, ఆయన ఇచ్చిన సమాధానం తనను ఆలోచింపజేసిందని ఆమె పేర్కొన్నారు. "నిజాయతీ, చిత్తశుద్ధి నా ఉద్యోగంలో, నా డీఎన్‌ఏలోనే భాగం. మీరు వాటిని ఏదో అసాధారణమైన విషయాలుగా ప్రశంసించడం చూస్తుంటే, అవి ఎంత అరుదైపోయాయో అర్థమవుతోంది. ఇది విచారకరమైన విషయం" అని తుకారాం ముండే అన్నట్లు కాజల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

కష్టమైనప్పటికీ సరైన పని చేయడానికి కట్టుబడిన ఆయన్ను కలవడం స్ఫూర్తినిచ్చిందని కాజల్ అన్నారు. సమగ్రత అనేది ప్రత్యేక గుణం కాదని, అది ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన ప్రమాణమని తుకారాం వంటి అధికారులు గుర్తుచేస్తున్నారని ఆమె తెలిపారు. ఆహార కల్తీ, మితిమీరిన పురుగుమందుల వాడకం, వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించే తమ ‘ది ఇండియా స్టోరీ’ చిత్రం కూడా చర్చిస్తోందని, ఆయన చేస్తున్న పనికి, తమ సినిమా సందేశానికి సంబంధం ఉండటం యాదృచ్ఛికంగా అనిపించిందని పేర్కొన్నారు. వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్న తుకారాం ముండేకు ఆమె అభినందనలు తెలిపారు.

కాగా, శ్రేయాస్ తల్పడే కూడా నటించిన ‘ది ఇండియా స్టోరీ’ చిత్రం జూలై 24న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement
Kajal Aggarwal
Tukaram Mundhe
The India Story
Maharashtra IAS officer
Shreyas Talpade
Food safety awareness

More Telugu News