తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు కొత్త రూపు.. నూతన వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu inspects new Thalli-Bidda Express vehicles
  • రాష్ట్రవ్యాప్తంగా 500 నూతన వాహనాలతో సేవలు అందించనున్న ప్రభుత్వం
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలకు ఉచిత, సురక్షిత రవాణా
  • జీపీఎస్, ఏసీ, సీట్ బెల్టుల వంటి ఆధునిక సౌకర్యాలతో వాహనాల రూపకల్పన
  • ఏటా సుమారు 2.75 లక్షల మంది బాలింతలకు ప్రయోజనం చేకూరనున్న అంచనా
రాష్ట్రంలో మాతా–శిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం, 'తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్' సేవలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సౌకర్యం కల్పించేందుకు సిద్ధం చేసిన 500 నూతన వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు.

ఈ సందర్భంగా వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలను సీఎం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా తల్లీబిడ్డల అవసరాలకు అనుగుణంగా వాహనాల్లో చేసిన మార్పులను అధికారులు ఆయనకు వివరించారు. ఈ సేవలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించేలా వాహనాలపై రూపొందించిన బ్రాండింగ్ నమూనాలను పరిశీలించి, వాటికి ఆమోదం తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలను, వారి నవజాత శిశువులను, సహాయకులను ఉచితంగా, క్షేమంగా వారి ఇళ్లకు చేర్చడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీంతో పాటు, అధిక రక్తహీనతతో బాధపడే గర్భిణులు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న గర్భిణులను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రులకు తీసుకురావడానికి కూడా ఈ వాహనాలను వినియోగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 500 SUV/MUV వాహనాల ద్వారా అందించే ఈ సేవలతో ఏటా సుమారు 2.75 లక్షల మంది బాలింతలు లబ్ధి పొందనున్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఈ కొత్త వాహనాల్లో ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు పెద్దపీట వేశారు. వెనుక సీట్లలో సైతం సీటు బెల్టులు, బాలింతలు సులభంగా ఎక్కి దిగేందుకు వీలుగా ఫుట్‌రెస్ట్, ఎయిర్ కండిషనింగ్ (ఏసీ), ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక పరికరాలు వంటివి ఏర్పాటు చేశారు. ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను అనుసంధానించడం ద్వారా వాటి కదలికలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించనున్నారు. వాహనాలపై అధికారిక స్టిక్కరింగ్ పూర్తి చేసి, త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి వీరపాండ్యన్, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Thalli-Bidda Express
Andhra Pradesh Health
Maternal Child Welfare
New Medical Vehicles
AP Government Schemes

More Telugu News