దశాబ్దాల మొండి సమస్యకు మంత్రి నారా లోకేశ్ శాశ్వత పరిష్కారం

Nara Lokesh provides permanent solution to decades-old land problem
  • మంగళగిరిలో దశాబ్దాల ఇంటి స్థలాల సమస్యకు మంత్రి లోకేశ్ పరిష్కారం
  • 'మన ఇల్లు – మన లోకేశ్' కింద రెండో విడతలో 3 వేల మందికి పట్టాల పంపిణీ
  • ఈ నెల 21, 22 తేదీల్లో లబ్ధిదారులకు పట్టాలు అందించనున్న మంత్రి
  • నిషేధిత జాబితాలోని భూములకు ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్లు జారీ
  • సుమారు రూ.1,000 కోట్ల విలువైన భూములకు పేదలకు శాశ్వత హక్కులు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నెలకొన్న జఠిలమైన భూ సమస్యకు రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ శాశ్వత పరిష్కారం చూపారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు యాజమాన్య హక్కులు కల్పించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా, ‘మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమం కింద రెండో విడతలో సుమారు 3,000 కుటుంబాలకు ఈ నెల 21, 22 తేదీల్లో శాశ్వత పట్టాలు పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మంగళగిరి నియోజకవర్గంలోని కొండవాలు, అటవీ, దేవాలయ భూముల్లో వేలాది కుటుంబాలు దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నాయి. అయితే, ఆ స్థలాలపై వారికి ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ఆస్తులను పిల్లలకు బదిలీ చేయాలన్నా, అత్యవసరానికి రుణం పొందాలన్నా వీలుకాని దుస్థితి నెలకొంది. 

ఎన్నికల ప్రచారంలో ఈ సమస్యను గుర్తించిన లోకేశ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం, అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు చేపట్టారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే తొలి విడతలో భాగంగా రత్నాల చెరువు, యర్రబాలెం, నీరుకొండ వంటి ప్రాంతాల్లో 3,002 మందికి సుమారు రూ.1,000 కోట్ల విలువైన భూములపై శాశ్వత హక్కులు కల్పించారు.

ప్రస్తుతం రెండో విడతలో భాగంగా మంగళగిరి డీజీపీ కార్యాలయం సమీపంలోని సీకే కన్వెన్షన్ హాలులో పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ విడతలో అందించే పట్టాల మార్కెట్ విలువ కూడా సుమారు రూ.1,000 కోట్లు ఉంటుందని అంచనా.

వివిధ కేటగిరీల కింద పట్టాల పంపిణీ:

సెక్షన్ 22A సమస్యకు పరిష్కారం: మంగళగిరి, నవులూరు గ్రామాల్లోని కొన్ని సర్వే నంబర్ల భూములు సెక్షన్ 22A(1)(a) కింద నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండటంతో 1,622 నివాస గృహాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఈ నిషేధాన్ని తొలగిస్తూ, ఆర్డీవో ధ్రువీకరించిన ‘ప్రాపర్టీ ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్ల’ను మంత్రి లోకేశ్ లబ్ధిదారులకు అందజేయనున్నారు.

స్టీల్ బ్రిడ్జ్ నిర్వాసితులకు పట్టాలు: అమరావతిలో బకింగ్‌హామ్ కాలువపై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంతో నిర్వాసితులైన 81 మందికి పునరావాసం కింద ఆత్మకూరు లేఅవుట్‌లో ప్లాట్లను కేటాయించారు. వీరికి సంబంధించిన పట్టాలను కూడా ఈ కార్యక్రమంలో పంపిణీ చేయనున్నారు.

G.O.Ms.No.30 కింద క్రమబద్ధీకరణ: 150 చదరపు గజాల లోపు విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరిస్తూ 906 పట్టాలను సిద్ధం చేశారు. వీటిలో తాడేపల్లి మండలానికి 630, మంగళగిరి మండలానికి 276 పట్టాలు ఉన్నాయి.

మొత్తంమీద, దశాబ్దాలుగా కాగితాలపై హక్కుల్లేక అభద్రతాభావంతో జీవిస్తున్న వేలాది కుటుంబాలకు మంత్రి లోకేశ్ చొరవతో శాశ్వత భరోసా లభించనుంది.
Advertisement
Nara Lokesh
Mangalagiri land titles
Mana Illu Mana Lokesh
Andhra Pradesh land regularization
Section 22A land issue
Tadepalli housing pattas

More Telugu News