పెరిగిన వేతనంలో సగం క్యాష్‌ రూపంలో.. యాక్సెంచర్‌ కొత్త విధానం!

Accenture modifies salary hike structure for global employees
  • వేతన పెంపులో సగం బేసిక్‌ శాలరీలో కలుపుతారు
  • మిగిలిన సగాన్ని ఒకేసారి నగదు రూపంలో చెల్లిస్తారు
  • వేతన పెంపు అర్హులను పెంచిన యాక్సెంచర్‌
  • ప్రమోషన్‌తో వచ్చే వేతన పెంపుపై ప్రభావం ఉండదని స్పష్టీకరణ
  • పన్ను విషయంలో ఉద్యోగుల్లో ఆందోళన
ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్‌ ఉద్యోగుల వేతన పెంపు విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై ఉద్యోగులకు మంజూరయ్యే వేతన పెంపులో సగం మొత్తాన్ని బేసిక్‌ శాలరీలో కలపగా, మిగిలిన సగాన్ని ఒకేసారి నగదు రూపంలో చెల్లించనుంది. ఈ కొత్త విధానం జూన్‌ శాలరీ రివ్యూ నుంచి అమల్లోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులతో పాటు భారత్‌లోని సుమారు 3.5 లక్షల మంది ఉద్యోగులకు ఇది వర్తించనుంది.

కొత్త విధానం ప్రకారం ఉద్యోగికి 3 శాతం వేతన పెంపు మంజూరైతే, అందులో 1.5 శాతం మాత్రమే బేసిక్‌ శాలరీలో కలుస్తుంది. మిగిలిన 1.5 శాతానికి సమానమైన మొత్తాన్ని జూన్‌లో ఒకేసారి నగదు రూపంలో చెల్లిస్తారు. దీంతో ఉద్యోగుల చేతికి వెంటనే కొంత అదనపు నగదు అందుతుందని, అదే సమయంలో ఎక్కువ మంది ఉద్యోగులకు బేసిక్‌ పే పెంపు అవకాశం కల్పించవచ్చని సంస్థ అంతర్గత మెమోలో పేర్కొంది.

గతేడాది ఒకే హోదాలో కొనసాగిన ఉద్యోగుల్లో కొంత మందికే వేతన పెంపు ఇచ్చిన యాక్సెంచర్‌, ఈసారి పెంపును రెండు భాగాలుగా విభజించడం ద్వారా అర్హుల సంఖ్యను పెంచినట్లు తెలిపింది.

అయితే ప్రమోషన్‌తో వచ్చే వేతన పెంపు విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ప్రమోషన్‌ ద్వారా లభించే మొత్తం పెంపు యథావిధిగా బేసిక్‌ శాలరీలోనే కలుస్తుందని వెల్లడించింది. అలాగే ప్రతి ఏడాది డిసెంబరులో ఇచ్చే వార్షిక బోనస్‌కు ఈ నగదు చెల్లింపుకు ఎలాంటి సంబంధం ఉండదని తెలిపింది.

ఉద్యోగుల నైపుణ్యం, పనితీరు, సంస్థపై చూపిన ప్రభావం, ప్రవర్తన వంటి అంశాల ఆధారంగానే వేతన పెంపు నిర్ణయాలు కొనసాగుతాయని యాక్సెంచర్‌ పేర్కొంది. అయితే ఈ కొత్త విధానంపై ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ విధానం ఈ ఏడాదికే పరిమితమా? ఒకేసారి చెల్లించే నగదుపై పన్ను ఎలా ఉంటుందనే అంశాలపై ఉద్యోగులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Accenture
Accenture salary hike policy
IT sector salary increments
Accenture India employees
One time cash payment
Accenture compensation changes

More Telugu News