రెండు మేక పిల్లల కోసం దారుణ హత్య.. నెల్లూరు జిల్లాలో ఘటన

Brutal murder over two goat kids incident in Nellore district
  • మేక పిల్లల పంపకంలో వివాదం.. యువకుడి హత్య
  • నెల్లూరు జిల్లా కావలిలో మేకల కాపరి దారుణ హత్య
  • పంచాయితీ పెట్టిన మాజీ సర్పంచే నిందితుడిగా ఆరోపణ
  • మద్యం తాగించి, పథకం ప్రకారం దాడి చేసి చంపిన వైనం
  • మాజీ సర్పంచ్‌తో పాటు మరొకరిని అరెస్ట్ చేసిన పోలీసులు
నెల్లూరు జిల్లా కావలిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. రెండు మేక పిల్లల పంపకం విషయంలో మొదలైన ఓ చిన్న గొడవ, చిలికి చిలికి గాలివానగా మారి ఒక యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ హత్య కేసులో గ్రామ పెద్ద, మాజీ సర్పంచే ప్రధాన నిందితుడిగా ఉండటం స్థానికంగా కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే.. కావలి మండలం, సర్వాయపాలెం పంచాయతీ పరిధిలోని తాగేటివారిపాలేనికి చెందిన చాట్ల వాసు (26) మేకల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి తన మేకను సంరక్షణ కోసం వాసుకు అప్పగించాడు. ఇటీవల ఆ మేక ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో, మేకను కాపలా కాసినందుకు తనకు రెండు పిల్లలను ఇవ్వాలని వాసు యజమాని జనార్దన్‌ను కోరాడు. అయితే, మేకలను కాయడానికి ప్రతి నెలా కూలీ ఇస్తున్నందున, అదనంగా పిల్లలను ఇవ్వడం కుదరదని జనార్దన్ తేల్చి చెప్పాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వివాదం మొదలైంది.

ఈ గొడవను జనార్దన్ గ్రామ పెద్ద, మాజీ సర్పంచ్ అయిన మందా మధు దృష్టికి తీసుకెళ్లాడు. ఈ సమస్యపై పంచాయితీ జరుగుతున్న సమయంలో వాసుకు, మధుకు మధ్య మాటామాటా పెరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మధు, వాసుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీన వాసును అడవిరాజుపాలెంలోని ఒక మద్యం దుకాణానికి పథకం ప్రకారం తీసుకెళ్లాడు.

అక్కడ వాసుకు మద్యం తాగించిన తర్వాత, మధు తన ముగ్గురు అనుచరులతో కలిసి అతనిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న వాసును గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. తొలుత మద్యం మత్తులో కిందపడి గాయపడ్డాడని అందరూ భావించారు. అయితే, చికిత్స పొందుతున్న సమయంలో వాసు అసలు విషయం చెప్పాడు. కొద్దిసేపటికే అతను ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రధాన నిందితుడైన మంద మధుతో పాటు దాడికి సహకరించిన పందల రవిచంద్రను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Advertisement
Vasu Chatla
Manda Madhu
Nellore crime news
Goat dispute murder
Kavali former Sarpanch arrest
Andhra Pradesh murder case

More Telugu News