రష్యాతో భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఉక్రెయిన్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. దేశ నూతన ప్రధానమంత్రిగా ఇంధన రంగ నిపుణుడు సెర్హీ కోరెట్స్కీ నియమితులయ్యారు. ఆయన నియామకానికి ఉక్రెయిన్ పార్లమెంట్ గురువారం ఆమోదముద్ర వేసింది. దేశ ఇంధన మౌలిక సదుపాయాలపై రష్యా దాడులు తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో, ఈ రంగానికి చెందిన అనుభవజ్ఞుడికి ప్రధాని పగ్గాలు అప్పగించడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధాని యూలియా స్విరిడెంకో తన పదవికి రాజీనామా చేయగా, ఆమె స్థానంలో ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ 'నాఫ్టోగాజ్' సీఈఓగా పనిచేస్తున్న సెర్హీ కోరెట్స్కీ పేరును జెలెన్‌స్కీ ప్రతిపాదించారు. పార్లమెంట్ సభ్యులు ఈ ప్రతిపాదనను ఆమోదించారు. 2022లో రష్యా పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తిగా కోరెట్స్కీ నిలిచారు.

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కోరెట్స్కీ తన ప్రాధాన్యతలను స్పష్టం చేశారు. "ఉక్రెయిన్ రక్షణ దళాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడం, రక్షణ పరిశ్రమల అభివృద్ధిని వేగవంతం చేయడం, రాబోయే శీతాకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం మా ప్రథమ కర్తవ్యం" అని ఆయన 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. వీటితో పాటు సామాజిక బాధ్యతలను నెరవేర్చడం, యూరోపియన్ యూనియన్‌లో చేరే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం తన ప్రధాన లక్ష్యాలని ఆయన వివరించారు.

48 ఏళ్ల కోరెట్స్కీకి ఇంధన రంగంలో అపార అనుభవం ఉంది. అయితే, ఆయనకు గతంలో ఎలాంటి రాజకీయ పదవుల అనుభవం లేదు. రష్యా దాడుల నడుమ దేశ ఇంధన స్థిరత్వాన్ని కాపాడటంలో నాఫ్టోగాజ్ సీఈఓగా ఆయన కీలక పాత్ర పోషించారు.