రండి.. చట్టాన్ని ఎదుర్కోండి: షేక్ హసీనా రాకపై బంగ్లాదేశ్ సర్కార్ స్పందన

Bangladesh government challenges Sheikh Hasina over her return plans
  • ఈ ఏడాది చివరి నాటికి బంగ్లాదేశ్ వెళతానంటున్న షేక్ హసీనా
  • హసీనాకు స్వాగతమన్న ప్రధాని రెహమాన్ సలహాదారు జాహెద్
  • అయితే తనపై ఉన్న కేసులను హసీనా ఎదుర్కోవాలని వ్యాఖ్య

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలపై అక్కడి ప్రస్తుత ప్రభుత్వం అత్యంత దూకుడుగా స్పందించింది. ఆమె ఢాకాకు రావాలనుకోవడాన్ని తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని పేర్కొంటూనే.. దేశద్రోహం, మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో మరణశిక్ష పడిన నేరస్థురాలిగా ఆమె చట్టాన్ని ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.


2024 ఆగస్టులో జరిగిన ప్రజా తిరుగుబాటుతో బంగ్లాదేశ్‌ను వదిలి పారిపోయిన షేక్ హసీనా... ప్రస్తుతం భారత్ లో తలదాచుకుంటున్నారు. అయితే, ఈ ఏడాది చివరినాటికి ఆమె స్వచ్ఛందంగా ఢాకాకు చేరుకుని, తన 'అవామీ లీగ్' పార్టీని మళ్లీ బతికించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.


హసీనా రాకపై బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ సలహాదారు జాహెద్ ఉర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 నాటి విద్యార్థుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసి, వందల మంది ప్రాణాలు తీసిన నేరాలపై హసీనా కోర్టులో పోరాడాలని ఆయన అన్నారు. దేశ ప్రజలంతా ఆమెకు పడిన మరణశిక్ష అమలు కావాలని కోరుకుంటున్నారని, ఆమె వస్తే న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు.


అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ లో జరిగే ఈ విచారణ అంతా పారదర్శకంగా ఉంటుందని, ప్రపంచ దేశాల పరిశీలకులు దీనిని గమనించవచ్చని చెప్పారు. ఒకవేళ కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తే దానికి కూడా తాము సిద్ధమేనని, హసీనా రాకపై ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.


గత ఏడాది నవంబర్‌లో ఢాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్... విద్యార్థుల నిరసనల అణచివేత కేసులో హసీనాకు ఆమె లేని సమయంలోనే మరణశిక్ష విధించింది. అయితే ఈ కేసులన్నీ రాజకీయ కక్షసాధింపు చర్యలేనని హసీనా కొట్టిపారేస్తున్నారు. అప్పటినుంచి ఆమెను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ భారత్‌ను కోరుతోంది.


హసీనా తాజా ప్రణాళికలపై భారత విదేశాంగ శాఖ అత్యంత జాగ్రత్తగా స్పందించింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. "ఈ విషయంలో మా విధానంలో ఎలాంటి మార్పు లేదు. నేరస్థుల అప్పగింత అనేది పూర్తిగా ఒక చట్టపరమైన ప్రక్రియ. దాని ప్రకారం ఏది జరగాల్సి ఉంటే అది చట్టబద్ధంగానే జరుగుతుంది" అని చెప్పారు.
Advertisement
Sheikh Hasina
Bangladesh Government
Awami League
India Bangladesh Relations
Sheikh Hasina Extradition
Dhaka Student Protests

More Telugu News