బొమ్మలు తగ్గిస్తే పిల్లలు మరింత తెలివిగా మారతారా? జర్మనీ ప్రయోగం చెప్పింది ఇదే!

Germany Toy Experiment Reveals Benefits Of Toy Free Kindergartens
  • జర్మనీలో 3 నెలలు బొమ్మలు తొలగించి ప్రయోగం
  • కొన్ని రోజుల్లోనే పిల్లల్లో పెరిగిన ఊహాశక్తి
  • ఎక్కువైన పరస్పర సహకారం, సంభాషణలు
  • తక్కువ బొమ్మలతో ఎక్కువసేపు ఆడినట్లు వెల్లడి
  • బొమ్మల సంఖ్య కంటే నాణ్యత ముఖ్యమని సూచన
  • స్వేచ్ఛగా ఆడే అవకాశంతోనే పిల్లల ఎదుగుదల
పిల్లలకు కొత్త బొమ్మలు కొనివ్వాలనే కోరిక దాదాపు ప్రతి తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా మరోటి కొనాలని అనిపిస్తుంది. పిల్లలు ఎక్కువ బొమ్మలతో ఆడితేనే బాగా నేర్చుకుంటారని చాలామంది భావిస్తారు. కానీ జర్మనీలో జరిగిన ఓ ప్రయోగం మాత్రం ఈ అభిప్రాయానికి భిన్నమైన చిత్రాన్ని చూపించింది. బొమ్మలు తగ్గితే పిల్లల ఊహాశక్తి, ఏకాగ్రత, పరస్పర సహకారం మరింత పెరగొచ్చని ఆ ప్రయోగం వెల్లడించింది.

బొమ్మలు లేకుండా 3 నెలలు
1990ల్లో జర్మనీలోని కొన్ని కిండర్‌గార్టెన్‌ పాఠశాలలు ‘టాయ్‌ ఫ్రీ కిండర్‌గార్టెన్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో తరగతి గదిలోని బొమ్మలన్నింటినీ మూడు నెలల పాటు తొలగించారు. బ్లాక్స్‌, బొమ్మలు, పజిల్స్‌, టాయ్‌ కార్లు ఏవీ పిల్లలకు అందుబాటులో లేకుండా చేశారు. మొదట్లో పిల్లలు విసుగు చెందారు. చిన్నచిన్న గొడవలు కూడా ఎక్కువయ్యాయి. అయినా ఉపాధ్యాయులు వెంటనే జోక్యం చేసుకోకుండా పరిస్థితిని గమనించారు.

ఊహాశక్తికి రెక్కలు
కొన్ని రోజుల తర్వాత పిల్లల్లో ఊహించని మార్పులు కనిపించాయి. కుర్చీలు రైళ్లు, దొంగల నౌకలుగా మారాయి. దుప్పట్లు గుహలు, కోటలు, రహస్య స్థావరాలుగా రూపాంతరం చెందాయి. సిద్ధంగా ఉన్న బొమ్మలపై ఆధారపడకుండా పిల్లలే కొత్త ఆటలను సృష్టించడం మొదలుపెట్టారు. ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడటం, కలిసి కథలు అల్లుకోవడం, చిన్న సమస్యలను పరస్పరం పరిష్కరించుకోవడం పెరిగిందని పాఠశాలలు గుర్తించాయి.

పరిశోధనలోనూ అదే ఫలితం
ఈ ఆలోచనకు తర్వాతి కాలంలో పరిశోధనలు కూడా మద్దతు ఇచ్చాయి. 2018లో యూనివర్సిటీ ఆఫ్‌ టోలెడో పరిశోధకులు 18 నుంచి 30 నెలల వయసున్న 36 మంది చిన్నారులపై అధ్యయనం నిర్వహించారు. ఒకసారి నాలుగు బొమ్మలు, మరోసారి 16 బొమ్మలు ఇచ్చి వారి ప్రవర్తనను పరిశీలించారు. తక్కువ బొమ్మలు ఉన్నప్పుడు పిల్లలు ఒక్కో బొమ్మతో ఎక్కువసేపు ఆడటంతో పాటు అదే బొమ్మను కొత్త కొత్త విధాలుగా ఉపయోగిస్తూ సృజనాత్మకతను ప్రదర్శించినట్లు గుర్తించారు.

ఎక్కువ బొమ్మలతో ఎందుకు సమస్య?
పిల్లల చుట్టూ బొమ్మలు ఎక్కువగా ఉంటే ఒకదాని నుంచి మరోదానికి వెంటనే మారిపోతారని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో ఏ ఒక్క బొమ్మతోనూ పూర్తిగా మమేకం కాలేరని వివరించారు. తక్కువ ఉన్నప్పుడు మాత్రం అదే వస్తువును లోతుగా పరిశీలిస్తూ ఎక్కువ సమయం గడుపుతారని తెలిపారు. అయితే బొమ్మలు అవసరం లేదనే అర్థం కాదని స్పష్టం చేశారు.

నాణ్యత ముఖ్యం
పిల్లల ఎదుగుదలకు బొమ్మలు ఉపయోగపడతాయని, అయితే వాటి సంఖ్య కంటే వాటి ఉపయోగం ముఖ్యమని పరిశోధకులు చెబుతున్నారు. బిల్డింగ్‌ బ్లాక్స్‌, డ్రాయింగ్‌ సామగ్రి, ఊహాశక్తిని పెంచే ఆట వస్తువులు పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతాయి. మరోవైపు బ్యాటరీతో పనిచేస్తూ అన్నీ తామే చేసే బొమ్మలు పిల్లల ఊహాశక్తికి పెద్దగా అవకాశం ఇవ్వవని సూచించారు. పిల్లల ఆటల్లో అసలు విలువ ఖరీదైన బొమ్మల్లో కాకుండా, స్వేచ్ఛగా ఆలోచించే అవకాశంలోనే ఉంటుందని ఈ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
Advertisement
Germany Toy Experiment
Child Development
Toy Free Kindergarten
Creative Play
Parenting Tips
University of Toledo

More Telugu News