మరోసారి టాప్ బ్రాండ్‌గా టాటా.. టాప్-10లోకి తొలిసారి అదానీ గ్రూప్!

Tata Group remains Indias top brand while Adani Group enters top 10 for first time
  • భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌గా వరుసగా 18వ సారి టాటా గ్రూప్
  • టాప్-10 జాబితాలోకి తొలిసారి ప్రవేశించిన అదానీ గ్రూప్
  • అత్యంత వేగంగా ఎదుగుతున్న బ్రాండ్‌గా సుజ్లాన్ ఎనర్జీ రికార్డ్
  • 7% పెరిగి 252.8 బిలియన్‌ డాల‌ర్ల‌కు చేరిన దేశంలోని 100 బ్రాండ్ల మొత్తం విలువ 
  • భారతదేశపు అత్యంత శక్తిమంతమైన బ్రాండ్‌గా తాజ్ హోటల్స్ స్థానం పదిలం
భారత కార్పొరేట్ రంగంలో టాటా గ్రూప్ మరోసారి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. వరుసగా 18వ ఏడాది కూడా దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా మొదటి స్థానంలో నిలిచింది. అయితే, ఈసారి ర్యాంకింగ్స్‌లో అదానీ గ్రూప్ సంచలనం సృష్టించింది. మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాల్లో వేగంగా విస్తరిస్తున్న అదానీ గ్రూప్, తొలిసారిగా టాప్-10 అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో చోటు దక్కించుకుంది. 'బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా 100 2026' నివేదిక ఈ ఆసక్తికర వివరాలను వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ భారత కంపెనీలు బలంగా నిలబడ్డాయి. దేశంలోని 100 అత్యంత విలువైన బ్రాండ్ల మొత్తం విలువ వార్షికంగా 7శాతం వృద్ధితో 252.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.24.34 లక్షల కోట్లు) కు చేరింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడులు పెడుతున్న సంస్థల బ్రాండ్ విలువ గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. 

టాటాదే అగ్రస్థానం
టాటా గ్రూప్ తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. గతేడాదితో పోలిస్తే 6శాతం వృద్ధితో తన బ్రాండ్ విలువను 33.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.24 లక్షల కోట్లు)కు పెంచుకుంది. ఎలక్ట్రానిక్స్, డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, సెమీకండక్టర్లు వంటి భవిష్యత్ రంగాలపై దృష్టి సారించడం టాటాకు కలిసొచ్చింది. ఇక, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 16.4 బిలియన్ డాలర్ల (రూ.1.58 లక్షల కోట్లు) బ్రాండ్ విలువతో వరుసగా ఐదోసారి రెండో స్థానంలో నిలిచింది. ఎల్ఐసీ 12% వృద్ధితో 15.3 బిలియన్ డాలర్ల (రూ.1.47 లక్షల కోట్లు)తో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ (రూ.1.33లక్షల కోట్లు) , రిలయన్స్ గ్రూప్ (రూ.1.03లక్షల కోట్లు)  వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఎస్‌బీఐ గ్రూప్ (రూ. 94,229కోట్లు), హెచ్‌సీఎల్‌టెక్ (రూ. 86,541 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

సంచలనం సృష్టించిన అదానీ
ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో అతిపెద్ద మార్పు అదానీ గ్రూప్ రూపంలో కనిపించింది. ఈ గ్రూప్ బ్రాండ్ విలువ ఏకంగా 31శాతం వృద్ధితో 8.5 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో తొలిసారిగా టాప్-10 జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, ఎయిర్‌పోర్ట్స్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో దూకుడుగా విస్తరించడం అదానీ గ్రూప్ బ్రాండ్ విలువ పెరగడానికి ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) 8.3 బిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానంలో, ఎయిర్‌టెల్ 8.1 బిలియన్ డాలర్లతో పదో స్థానంలో నిలిచాయి.

వేగవంతమైన వృద్ధిలో సుజ్లాన్ టాప్
మొత్తం జాబితాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న బ్రాండ్‌గా సుజ్లాన్ ఎనర్జీ నిలిచింది. ఈ సంస్థ బ్రాండ్ విలువ రికార్డు స్థాయిలో 114 శాతం పెరిగి 418 మిలియన్ డాలర్లకు చేరింది. అదానీ పవర్ బ్రాండ్ విలువ 152 శాతం పెరిగి 1.8 బిలియన్ డాలర్లకు చేరడం విశేషం. యస్ బ్యాంక్ (79 శాతం), జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ (55శాతం) కూడా గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి.

ఇక, బ్రాండ్ విలువతో పాటు వినియోగదారుల నమ్మకాన్ని కొలిచే 'బ్రాండ్ స్ట్రెంగ్త్' విషయంలో తాజ్ హోటల్స్ వరుసగా ఐదోసారి దేశంలోనే అత్యంత శక్తిమంతమైన బ్రాండ్‌గా నిలిచింది. జొమాటో, అమూల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐటీ సేవల రంగంలో టీసీఎస్ 21.2 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో దేశంలో అగ్రగామిగా, ప్రపంచంలో రెండో అత్యంత విలువైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
Advertisement
Tata Group
Adani Group
Brand Finance India 100
Most Valuable Indian Brands
Infosys
Indian Corporate Rankings

More Telugu News