58 ఏళ్లలోనే అతిపెద్ద షాక్‌.. ఒక్క రోజులో రూ.6 లక్షల కోట్లు ఆవిరైన ఐబీఎం సంపద

IBM shares crash 25 percent as market value drops significantly
  • ఐబీఎం షేర్లు ఒక్క రోజులో 25 శాతం పతనం
  • రూ.6 లక్షల కోట్లు తగ్గిన కంపెనీ మార్కెట్‌ విలువ
  • త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడమే కారణం
  • ఏఐ పెట్టుబడులతో ఇతర పరికరాలవైపు ఖర్చులను మళ్లిస్తున్న కంపెనీలు
  • సైబర్‌ భద్రతపై  దృష్టి సారించిన సంస్థలు
  • దీంతో మెయిన్‌ఫ్రేమ్‌ కంప్యూటర్లు, వాటి సాఫ్ట్‌వేర్లపై తగ్గిన ఖర్చు
అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం చరిత్రలోనే అరుదైన ఎదురుదెబ్బను ఎదుర్కొంది. కంపెనీ షేర్లు ఒక్క రోజులోనే 25 శాతం కుప్పకూలడంతో మార్కెట్‌లో కలకలం రేగింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువలో సుమారు రూ.6 లక్షల కోట్ల వరకు ఆవిరైంది. గత 58 ఏళ్లలో కంపెనీ షేరు విలువ ఈ స్థాయిలో పతనమవడం ఇదే తొలిసారి. రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా మారింది.

జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో కంపెనీ ఆదాయం కేవలం ఒక శాతం మాత్రమే పెరిగి దాదాపు రూ.1.48 లక్షల కోట్లకు చేరింది. అయితే ఐబీఎం ప్రధాన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యాపార ఆదాయం ఏడు శాతం తగ్గింది. సాఫ్ట్‌వేర్‌ విభాగం ఐదు శాతం వృద్ధి సాధించినా ఇన్వెస్టర్ల అంచనాలను అందుకోలేకపోయింది. మారుతున్న పరిస్థితులకు తాము మారలేకపోయామని కంపెనీ సీఈఓ అరవింద్‌ కృష్ణ పెట్టుబడిదారులకు రాసిన లేఖలో అంగీకరించారు.

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సర్వర్లు, మెమరీ చిప్‌లు, స్టోరేజ్‌ పరికరాలకు డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగింది. భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాతో జూన్‌ చివర్లో అనేక కంపెనీలు ఈ పరికరాల కొనుగోలుకే తమ పెట్టుబడులను మళ్లించాయి. దీనివల్ల ఐబీఎంకు ఎక్కువ లాభాలు తెచ్చే మెయిన్‌ఫ్రేమ్‌ కంప్యూటర్లు, వాటికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌పై ఖర్చు తగ్గిపోయిందని కంపెనీ వెల్లడించింది.

ఏఐతో సైబర్‌ దాడుల ముప్పు పెరుగుతోందన్న ఆందోళన కూడా ఐబీఎం వ్యాపారంపై ప్రభావం చూపింది. ఆంథ్రోపిక్‌ విడుదల చేసిన ‘మిథోస్‌’ ఏఐ మోడల్‌ కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ల్లోని బలహీనతలను గుర్తించగలదన్న వార్తలతో కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఫలితంగా కొత్త ప్రాజెక్టుల కంటే సైబర్‌ భద్రతపైనే ఎక్కువ పెట్టుబడులు పెట్టాయి. అదే సమయంలో క్రౌడ్‌స్ట్రైక్‌, ఒక్టా, నెట్‌స్కోప్‌ వంటి సైబర్‌ సెక్యూరిటీ కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి.

ప్రతికూల పరిస్థితుల మధ్య ఐబీఎం రెడ్‌హ్యాట్‌ విభాగం 11 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. మెయిన్‌ఫ్రేమ్‌లకు భిన్నంగా ఉన్న సర్వర్‌, స్టోరేజ్‌ వ్యాపారం 37 శాతం వృద్ధి సాధించింది. అలాగే ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌లో భద్రతా లోపాలను గుర్తించి పరిష్కరించేందుకు దాదాపు రూ.43 వేల కోట్ల విలువైన ‘లైట్‌వెల్‌’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, జేపీ మోర్గాన్‌ ఛేజ్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ మద్దతు ఇస్తున్నాయి.
Advertisement
IBM
Arvind Krishna
IBM Stock Crash
IBM Market Value Loss
Technology Market News
Artificial Intelligence Infrastructure

More Telugu News