కళ్ల ముందే ఘోరం.. వియత్నాం బోటు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షుల కథనం

Vietnam Boat Accident eyewitness accounts of the tragic disaster
  • వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 15 మంది భారతీయుల మృతి
  • ఫోటోలు తీసుకుంటుండగా ఒక్కసారిగా బోల్తా పడ్డ స్పీడ్‌బోట్
  • పెద్ద కెరటం వల్లే ప్రమాదం జరిగిందన్న ప్రత్యక్ష సాక్షులు
  • మృతుల్లో ఏపీ, తమిళనాడు, కేరళ వాసులు
  • మృతదేహాల తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు
వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారు ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకున్నారు. కళ్ల ముందే మృత్యువును చూశామని, అసలు ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు.

శనివారం మధ్యాహ్నం స్థానిక కాలమానం ప్రకారం 1:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఫు క్విక్ ద్వీపానికి సమీపంలోని ఓ చిన్న ద్వీపం నుంచి బయల్దేరిన 300-400 మీటర్ల దూరంలోనే స్పీడ్‌బోట్ బోల్తా పడింది. "ప్రమాదం జరిగినప్పుడు తామంతా ఫొటోలు తీసుకుంటున్నాం. స్పందించేలోపే అంతా జరిగిపోయింది. అందరం ప్రాణభయంతో కేకలు వేశాం" అని ప్రాణాలతో బయటపడ్డ గుంటూరుకు చెందిన ఆశిష్ కుమార్ తెలిపారు.

సముద్రంలోకి కొంత దూరం వెళ్లాక ఒక్కసారిగా ఓ పెద్ద కెరటం బోటును బలంగా తాకిందని తమిళనాడుకు చెందిన మురుగరాజ్ అనే బాధితుడు వివరించారు. ఆ దెబ్బకు బోటు కుడివైపునకు పూర్తిగా ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. "బోటు వేగంగా మునిగిపోతుండటంతో ఎలాగోలా కిటికీలోంచి బయటపడి, బోటు రెయిలింగ్‌ను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాను" అని ఆయన తెలిపారు. భారీ కెరటాలు, బోటులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటం వల్లే క్షణాల్లో ఈ ఘోరం జరిగిందని మరో బాధితుడు నిర్మల్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ప్రమాద సమయంలో బోటులో 32 మంది భారతీయ పర్యాటకులు, నలుగురు స్థానిక సిబ్బందితో కలిపి మొత్తం 36 మంది ఉన్నారు. వీరిలో 21 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ప్రమాదం జరిగిన 5 నిమిషాల్లోనే రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయని బాధితులు తెలిపారు. మృతుల్లో 10 మంది తమిళనాడు, ముగ్గురు ఆంధ్రప్రదేశ్, ఇద్దరు కేరళకు చెందిన వారుగా గుర్తించారు.

ప్రముఖ మొబైల్ ఫోన్ల సంస్థ 'లావా' తమ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల కోసం ఈ ట్రిప్‌ను ఏర్పాటు చేసింది. సేల్స్ టార్గెట్లు పూర్తి చేసిన వారికి బహుమతిగా ఈ విహారయాత్రను ప్రకటించింది. వియత్నాంలోని ఫు క్విక్ ద్వీపం అందమైన బీచ్‌లకు, పగడపు దిబ్బలకు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం.

ఈ ఘటనపై లావా మొబైల్స్ సంస్థ స్పందించింది. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి.
Advertisement
Vietnam Boat Accident
Lava Mobiles
Phu Quoc Island
Indian Tourists
Vietnam Speedboat Tragedy
Ashish Kumar

More Telugu News