పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేసిన ముంబై ఆసుపత్రి

Pawan Kalyan Health Bulletin Released by Mumbai Hospital
  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై ముంబై ఆసుపత్రి అధికారిక బులెటిన్
  • కుడి భుజానికి విజయవంతంగా ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ పూర్తి
  • ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నారని వెల్లడి
  • పూర్తిగా కోలుకుని భుజం సాధారణ స్థితికి రావడానికి 4 నెలల సమయం
  • ప్రముఖ వైద్యుడు డాక్టర్ దిన్‌షా పర్దివాలా ఆధ్వర్యంలో శస్త్రచికిత్స
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా ఒక ప్రత్యేక హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఆయన కుడి భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నారని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆసుపత్రి ఆర్థ్రోస్కోపీ అండ్ షోల్డర్ సర్వీస్ డైరెక్టర్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ దిన్‌షా పార్దీవాలా ఆదివారం (జూలై 12) ఈ ప్రకటన జారీ చేశారు.

వైద్య బులెటిన్ ప్రకారం, పవన్ కల్యాణ్ కుడి భుజంలోని 'రొటేటర్ కఫ్'కు తీవ్రమైన గాయమైంది. భుజంలోని సుప్రాస్పినేటస్, ఇన్‌ఫ్రాస్పినేటస్ అనే కండర బంధనాలు (టెండన్స్) అధికంగా చిరిగిపోవడంతో పాటు, గ్రేటర్ ట్యూబరోసిటీ ఎముక వద్ద ఫ్రాక్చర్ కూడా అయినట్లు నిర్ధారణ అయిందని వైద్యులు వివరించారు. ఈ గాయానికి జూలై 11న కోకిలాబెన్ ఆసుపత్రిలో విజయవంతంగా 'ఆర్థ్రోస్కోపిక్ రిపేర్' సర్జరీ నిర్వహించినట్లు డాక్టర్ పార్దీవాలా పేర్కొన్నారు.

కీ-హోల్ పద్ధతిలో జరిగిన ఈ ఆపరేషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని, ప్రస్తుతం పవన్ కల్యాణ్ సౌకర్యంగా ఉన్నారని బులెటిన్‌లో తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకుంటారని, ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఒక పక్కా ప్రణాళికతో కూడిన 'షోల్డర్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్' ఉంటుందని వెల్లడించారు. ఈ పునరావాస ప్రక్రియ ద్వారా రాబోయే నాలుగు నెలల్లో ఆయన భుజం పనితీరు తిరిగి పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందని అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, జనసేన కార్యకర్తల్లో నెలకొన్న ఆందోళనకు ఈ అధికారిక ప్రకటనతో తెరపడినట్లయింది. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Advertisement
Pawan Kalyan
Kokilaben Hospital Mumbai
Pawan Kalyan Shoulder Surgery
Dr Dinshaw Pardiwala
Andhra Pradesh Deputy CM
Janasena Party Chief

More Telugu News