పేదల ఆరోగ్యంతో ఆడుకుంటే ఊరుకోం: చల్లూరు పీహెచ్‌సీ తనిఖీల్లో కౌశిక్ రెడ్డి హెచ్చరిక

Padi Kaushik Reddy warns officials during Challur PHC inspection
  • వీణవంక మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కౌశిక్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు
  • అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆసుపత్రి దారుణంగా తయారయిందని మండిపాటు
  • సగం మంది సిబ్బంది డిప్యుటేషన్ పై వేరే ప్రాంతాల్లో పని చేస్తున్నారన్న ఎమ్మెల్యే

ప్రభుత్వ వైద్యంపై ఆధారపడే పేద ప్రజల ఆరోగ్యం పట్ల అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హుజురాబాద్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. వీణవంక మండలం చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులు లేవని, సిబ్బంది కొరతతో వైద్యం అందడం లేదని స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చియని ఆయన తెలిపారు. స్థానిక నాయకులతో కలిసి ఈరోజు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కౌశిక్ రెడ్డి... ఆసుపత్రిలోని ఓపీ రిజిస్టర్, మందుల కౌంటర్, ల్యాబ్‌లను స్వయంగా పరిశీలించి, అక్కడ అందుతున్న సేవలపై వైద్యాధికారి డాక్టర్‌ సంతోష్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒకప్పుడు ప్రసవాల విభాగంలో విశేష ప్రతిభ కనబరిచి, ఏకంగా మూడు సార్లు ప్రతిష్ఠాత్మక అవార్డులు సాధించిన చల్లూరు పీహెచ్‌సీ... నేడు అధికారుల నిర్లక్ష్యం వల్ల అధ్వాన్నంగా తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి మొత్తం 12 మంది సిబ్బంది మంజూరై ఉన్నప్పటికీ, అందులో సగం మంది డిప్యుటేషన్‌పై వేరే ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ కేవలం ఒక్క డాక్టర్, అరకొర సిబ్బందితో నెట్టుకురావడం వల్ల పేదలకు పూర్తిస్థాయి వైద్యం అందడం లేదన్నారు.


ఆసుపత్రి నుంచే జిల్లా వైద్యాధికారి వెంకటరమణతో కౌశిక్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. డిప్యుటేషన్‌పై వెళ్లిన సిబ్బందిని తక్షణమే వెనక్కి రప్పించి, చల్లూరు పీహెచ్‌సీలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. వచ్చే వారం రోజుల్లో తాను మళ్లీ ఈ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శిస్తానని... ఆలోగా ఆసుపత్రి నిర్వహణ, సిబ్బంది హాజరు, పరిశుభ్రతతో పాటు రోగులకు అందించే వైద్య సేవల్లో స్పష్టమైన మార్పు రావాలని అధికారులకు గడువు విధించారు. విధుల్లో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Padi Kaushik Reddy
Challur PHC
Huzurabad MLA
BRS Party
Telangana Health Department
Hospital Inspection

More Telugu News