భార్య కోసం భారత్ నుంచి స్వీడన్.. సైకిల్‌పై వెళ్లిన ఆర్టిస్ట్ అద్భుత ప్రేమకథ... ఇప్పుడు డాక్యుమెంటరీ రూపంలో!

PK Mahanandia incredible love story of cycling from India to Sweden for his wife
  • భార్య కోసం 6,000 మైళ్లు సైకిల్‌పై ప్రయాణించిన ఒడిశా కళాకారుడి కథ
  • 'ది సైకిల్ ఆఫ్ లవ్' పేరుతో డాక్యుమెంటరీ, నిర్మాతగా ప్రియాంక చోప్రా
  • 1977లో ఢిల్లీ నుంచి స్వీడన్‌కు పీకే మహానందియా సాహస యాత్ర
  • ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న డాక్యుమెంటరీ, ట్రైలర్‌కు మంచి స్పందన
ప్రేమ కోసం ఖండాలు దాటిన ఒక అద్భుతమైన యథార్థ గాథ ఇప్పుడు డాక్యుమెంటరీ రూపంలో ప్రపంచం ముందుకు రాబోతోంది. భారతీయ కళాకారుడు పీకే మహానందియా, ఆయన స్వీడిష్ భార్య లోట్టా వాన్ షెడ్విన్‌ల అపురూప ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన 'ది సైకిల్ ఆఫ్ లవ్' డాక్యుమెంటరీకి ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదలై సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఒడిశాకు చెందిన పీకే మహానందియా 1975లో ఢిల్లీలో వీధి చిత్రకారుడిగా పనిచేసేవారు. ఆ సమయంలో స్వీడన్ నుంచి పర్యాటకురాలిగా వచ్చిన లోట్టాతో ఆయనకు పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. అనంతరం వీరిద్దరూ భారతీయ సంప్రదాయం పద్ధతిలో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకు లోట్టా తిరిగి తన స్వదేశానికి వెళ్లాల్సి వచ్చింది.

తన భార్యను చేరుకోవడానికి విమానం టికెట్ కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేకపోవడంతో, మహానందియా 1977లో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తన సైకిల్‌పైనే ఢిల్లీ నుంచి స్వీడన్‌కు ప్రయాణం మొదలుపెట్టారు. అఫ్ఘానిస్థాన్, ఇరాన్, టర్కీ వంటి పలు దేశాల మీదుగా దాదాపు 6,000 మైళ్లు దూరాన్ని ఆయన సైకిల్‌పైనే అధిగమించారు. నెలల తరబడి సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో దారిపొడవునా చిత్రాలు గీసి అమ్ముకుంటూ, అపరిచితుల సహాయంతో చివరకి తన భార్య వద్దకు చేరుకున్నారు. ఈ జంట గత ఐదు దశాబ్దాలుగా ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు.

ఈ అపురూప ప్రేమకథ తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా ట్రైలర్‌ను పంచుకుంటూ పేర్కొన్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఓర్లాండో వాన్ ఐన్సీడెల్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ, ఆగస్టు 28న అమెరికాలో, సెప్టెంబర్ 18న యూకేలో థియేటర్లలో విడుదల కానుంది.
Advertisement
PK Mahanandia
The Cycle of Love documentary
Priyanka Chopra Jonas
India to Sweden cycle journey

More Telugu News