'అతడు చిన్ననాటి స్నేహితుడే.. కానీ విద్వేషంతో ఉండేవారిని కలవను': యోగరాజ్‌పై తొలిసారి స్పందించిన కపిల్ దేవ్

Kapil Dev says he was a childhood friend but I dont meet hateful people responding to Yograj Singh
  • యోగరాజ్ సింగ్ ఆరోపణలపై తొలిసారి స్పందించిన కపిల్ దేవ్
  • విద్వేషంతో, చేదు అనుభవాలతో ఉండే వారిని కలవడం ఇష్టం ఉండదన్న కపిల్
  • కొడుకు అంత సక్సెస్ అయ్యాక యోగరాజ్ సంతోషంగా ఉండాలని సూచన
  • గతంలో గన్‌తో తన ఇంటికి వచ్చినట్లు యోగరాజ్ చెప్పిన వైనం
  • యోగరాజ్ తన చిన్ననాటి స్నేహితుడని, పాత మంచి రోజులు గుర్తుంచుకోవాలని వ్యాఖ్య
భారత క్రికెట్ దిగ్గజం, ప్రపంచ కప్ విజేత కపిల్ దేవ్ తన మాజీ సహచరుడు యోగరాజ్ సింగ్‌తో ఉన్న దశాబ్దాల వివాదంపై తొలిసారిగా మౌనం వీడాడు. యోగరాజ్ తన చిన్ననాటి స్నేహితుడే అయినప్పటికీ, జీవితంలో విద్వేషపూరితంగా, చేదుగా మారిన వ్యక్తులను కలవడం తనకు ఇష్టం ఉండదని స్పష్టం చేశాడు. ఓ క్రీడా ఛానెల్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కపిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

"అతను నన్ను కౌగిలించుకోవాలనుకుంటున్నాడు, కానీ మీరు స్నేహితుడిగా వస్తేనే" అని యాంకర్ అడగ్గా, కపిల్ దేవ్ తనదైన శైలిలో స్పందించారు. "అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు తెలియదు. నా వైపు నుంచి ఎలాంటి సమస్యా లేదు. నేను ఇప్పటికీ స్నేహితుడినే. కానీ, జీవితంలో చేదు అనుభవాలతో ర‌గిలిపోయే వ్యక్తులను కలవడం నాకు నచ్చదు. సంతోషంగా ఉండే వారిని కలవడానికే ఇష్టపడతాను. జీవితంలో ముందుకు సాగిపోవాలి. మీరు ర‌గిలిపోతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని ప్రేమించరు" అని అన్నాడు.

యోగరాజ్ సింగ్‌ను ఉద్దేశిస్తూ కపిల్ ఇంకా మాట్లాడుతూ.. "అతని కొడుకు (యువరాజ్ సింగ్) దేశం గర్వించేలా అద్భుతంగా రాణించాడు. కనీసం ఆ సంతోషంతోనైనా అతను ఆనందంగా జీవించాలి. జీవితంలో ఎవరికీ అన్నీ దొరకవు. కొన్నిసార్లు మీకు దక్కుతాయి, కొన్నిసార్లు మీ కుటుంబానికి దక్కుతాయి. చివరికి మీరు సంతోషంగా ఉండాలి కానీ చేదుగా కాదు. విద్వేషపూరితమైన వ్యక్తికి ఈ ప్రపంచంలో స్థానం ఉండదు" అని హితవు పలికాడు. ప్రపంచంలో ఎన్నో చూసిన వ్యక్తి, భారత్‌కు ఆడి, సినిమాల్లో కూడా నటించిన వ్యక్తి ఇంకా అసంతృప్తితో ఉండటం సరికాదని అభిప్రాయపడ్డాడు.

గత వివాదం ఇదే..
ఒకే కోచ్ వద్ద శిక్షణ పొందిన కపిల్ దేవ్, యోగరాజ్ సింగ్ కెరీర్ భిన్న మార్గాల్లో సాగింది. కపిల్ దిగ్గజ ఆల్‌రౌండర్‌గా ఎదిగితే, యోగరాజ్ కెరీర్ కేవలం ఒక టెస్టు, ఆరు వన్డేలకే పరిమితమైంది. దీనికి కపిల్ దేవే కారణమని యోగరాజ్ చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. "కపిల్ కెప్టెన్ అయ్యాక నన్ను కారణం లేకుండా జట్టు నుంచి తొలగించాడు" అని యోగరాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాకుండా "ఒకరోజు పిస్టల్ తీసుకుని కపిల్ ఇంటికి వెళ్లాను. అతడిని పన్నెండు సార్లు తిట్టాను. నీ వల్ల ఒక స్నేహితుడిని కోల్పోయాను. దీనికి నువ్వు మూల్యం చెల్లించుకుంటావని హెచ్చరించాను" అని యోగరాజ్ స్వయంగా వెల్లడించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఈ వివాదంపై యువరాజ్ సింగ్ ఒక సందర్భంలో కపిల్ దేవ్‌కు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే, ఆ విషయాన్ని కూడా కపిల్ ప్రస్తావిస్తూ.. "యువరాజ్ క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు. అతను అద్భుతమైన క్రికెటర్, దేశానికి ఎంతో సేవ చేశాడు. అతని వల్లే ఆటకు మరింత ఆదరణ పెరిగింది" అని అన్నాడు.

చివరగా యోగరాజ్ సింగ్‌తో ఉన్న స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ.. "అతను నా చిన్ననాటి స్నేహితుడు. మేం కలిసి పెరిగాం. మా దారులు వేరయ్యాయి. కానీ, మేం గడిపిన అద్భుతమైన సమయాన్ని నేను గుర్తుంచుకుంటాను. పెళ్లి తర్వాత విడాకులు తీసుకుంటే, మంచి రోజులను మర్చిపోకూడదు కదా? కానీ కొందరు మరీ చేదుగా మారిపోయి మంచిని కూడా మరిచిపోతారు" అని కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు.
Advertisement
Kapil Dev
Yograj Singh
Yuvraj Singh
Indian Cricket
Kapil Dev Yograj Singh Controversy
Cricket News India

More Telugu News