ట్రంప్ సంచ‌ల‌న‌ ప్రకటనతో భగ్గుమన్న ముడి చమురు ధ‌ర‌లు

Donald Trump sensational announcement crude oil prices surge
  • ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందంటూ ట్రంప్ ప్ర‌క‌ట‌న‌ 
  • 6 శాతానికి పైగా పెరిగిన ముడి చమురు ధరలు.
  • బ్యారెల్ 80 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్
  • చమురు ధరల ఎఫెక్ట్.. భారీగా నష్టపోయిన భారత స్టాక్ మార్కెట్లు
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇవాళ‌ చమురు ధరలు 6 శాతానికి పైగా ఎగబాకాయి. పశ్చిమాసియా నుంచి ఇంధన సరఫరాపై నెలకొన్న ఆందోళనలే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచాయి.

అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 6.52 శాతం (4.69 డాలర్లు) పెరిగి బ్యారెల్‌కు దాదాపు 80 డాలర్ల వద్దకు చేరింది. అదేవిధంగా, అమెరికా బెంచ్‌మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర కూడా 6 శాతం (4.85 డాలర్లు) పెరిగి బ్యారెల్‌కు 75 డాలర్ల సమీపంలో ట్రేడ్ అయింది. 'ఐఏఎన్ఎస్' తన కథనంలో ఈ వివరాలను వెల్లడించింది.

టర్కీలోని అంకారాలో జరుగుతున్న నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు ప్రతిగా తమ సైన్యం రాత్రికిరాత్రి ఇరాన్‌పై కొత్త దాడులు చేసిందని ఆయన తెలిపారు. "నా వరకు ఇరాన్‌తో ఒప్పందం ముగిసిపోయింది. వాళ్లతో ఇకపై చర్చలు జరపను. వాళ్లు రోగగ్రస్తులు, హింసావాదులు. అణుబాంబు దొరికితే దాన్ని వాడటానికి కూడా వెనుకాడరు. వాళ్లతో చర్చలు జరపడం అంటే సమయం వృథా చేసుకోవడమే. వాళ్లు అబద్ధాల కోరులు" అంటూ ఇరాన్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ పరిణామం భారత మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ముడి చమురు ధరల పెరుగుదలతో మధ్యాహ్నం 3 గంటల సమయానికి సెన్సెక్స్ 1,900 పాయింట్లు (2 శాతానికి పైగా) నష్టపోయి 76,259 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ కూడా దాదాపు 600 పాయింట్లు పతనమై 23,805 వద్ద నిలిచింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ సైతం 20 పైసలు క్షీణించి 95.16 వద్ద కొనసాగుతోంది.
Advertisement
Donald Trump
Crude Oil Prices
Iran US Tensions
Brent Crude Oil
Sensex Nifty Crash
Global Oil Market

More Telugu News