విశాఖ తీరంలో విషాదం.. గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు మృతి చెందినట్లు ప్రకటన

  • నాలుగు రోజుల పాటు కొనసాగిన సెర్చ్ ఆపరేషన్‌ను నిలిపివేసిన అధికారులు
  • ప్రాణాలతో బయటపడిన ఒకరి సమాచారంతో నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం
  • మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేత
  • కుటుంబ సభ్యుల ఆశలు ఆవిరి.. మత్స్యకార గ్రామాల్లో విషాద ఛాయలు
విశాఖపట్నం తీరంలో సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ నాలుగు రోజుల తర్వాత కూడా లభించలేదు. దీంతో వారు ప్రాణాలతో లేరని అధికారులు నిర్ధారించారు. వారిని కాపాడేందుకు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యలను నిన్న‌ అర్ధరాత్రితో నిలిపివేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల‌ 1న విశాఖ హార్బర్ నుంచి వేటకు బయలుదేరారు. 4న తిరిగి వస్తుండగా, బోటులో సాంకేతిక లోపం తలెత్తి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలతో బయటపడగా, మిగిలిన ఆరుగురు గల్లంతయ్యారు. కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు నౌకలు, రెండు హెలికాప్టర్లతో నాలుగు రోజుల పాటు విస్తృతంగా గాలించినా ఫలితం లేకపోయింది. 72 గంటలకు పైగా గడిచినా ఆచూకీ లభించకపోవడంతో, వారు మరణించినట్లు భావిస్తున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కరి చిన్న అనే మత్స్యకారుడిని ఆదివారం 'ఎంవీ యూనివర్స్ వెల్తీ' అనే వాణిజ్య నౌక సిబ్బంది రక్షించారు. సోమవారం అతడిని ఐఎన్ఎస్ డేగాకు తరలించి, కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చేర్చించారు. తన కళ్లెదుటే ఈ నెల‌ 4న మధ్యాహ్నం 3:30 గంటలకు బోటు మునిగిపోయిందని, తాను దాదాపు 18 గంటల పాటు ఈదుతూ సముద్రంలోనే ఉన్నానని చిన్న వైద్యులకు తెలిపాడు. ఆదివారం ఉదయం 9 గంటలకు నౌక సిబ్బంది తనను గుర్తించి కాపాడారని వివరించాడు. అతనిచ్చిన సమాచారంతోనే మిగిలిన ఆరుగురు మరణించి ఉంటారని అధికారులు నిర్ధారణకు వచ్చారు.

ఈ ఘటనతో మత్స్యకారుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు, అధికారులు బుధవారం మృతుల కుటుంబాలను పరామర్శించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 5 లక్షలు, మత్స్యశాఖ నుంచి రూ. 5 లక్షలు కలిపి మొత్తం రూ. 10 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. మత్స్యకారుల కుటుంబాలు పడుతున్న వేదన వర్ణనాతీతమని మంత్రి అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement

More Telugu News