వేగం అందుకున్న వెంకీ-అనిల్‌ సినిమా.. సెట్స్‌లోకి వెంకటేశ్‌

Venkatesh joins the sets of Anil Ravipudi new movie as shooting speeds up
  • సెట్స్‌లో చేరిన వెంకటేశ్‌
  • భారీ సెట్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ
  • షూటింగ్‌లో కల్యాణ్‌రామ్‌, కీర్తి, కృతి
  • సంక్రాంతి 2027కు సినిమా విడుదల
  • వెంకటేశ్‌-అనిల్‌కు ఇది ఐదో సినిమా
వెంకటేశ్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌ వేగం అందుకుంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీలక షెడ్యూల్‌ ప్రారంభమైంది. దీంట్లో పాల్గొనేందుకు వెంకటేశ్‌ తాజాగా సెట్స్‌లో అడుగుపెట్టారు.

ప్రస్తుతం ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ ఎపిసోడ్లలో వెంకటేశ్‌తో పాటు నందమూరి కల్యాణ్‌రామ్‌, కీర్తి సురేశ్‌, కృతి శెట్టి కూడా పాల్గొంటున్నారు. ఇటీవల కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజును చిత్రబృందం సెట్స్‌లోనే జరుపుకొంది. అదే సందర్భంగా సినిమాలో ఆయన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసి, 2027 సంక్రాంతికి సినిమా విడుదల కానుందని ప్రకటించింది.

ఇటీవల ఈ సినిమా పేరుతో నకిలీ కాస్టింగ్‌ కాల్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నిర్మాతలు హెచ్చరిక జారీ చేశారు. అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా వచ్చే ప్రకటనలను మాత్రమే నమ్మాలని, వ్యక్తిగత వివరాలు లేదా డబ్బు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఇవ్వొద్దని స్పష్టం చేశారు.

కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

వెంకటేశ్‌తో అనిల్‌ రావిపూడికి ఇది ఐదో సినిమా. ఇప్పటికే ‘ఎఫ్‌2’, ‘ఎఫ్‌3’, ‘సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకర వరప్రసాద్ గారు’ వంటి విజయాల తర్వాత మరోసారి ఇద్దరూ చేతులు కలిపారు. కల్యాణ్‌రామ్‌తో అనిల్‌కు ఇది రెండో చిత్రం. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పటాస్‌’ మంచి విజయం సాధించింది.

ఈ చిత్రాన్ని అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునే కుటుంబ వినోద కథగా రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. హాస్యం, భావోద్వేగాలు, వినోదానికి సమాన ప్రాధాన్యం ఉండేలా అనిల్‌ రావిపూడి తన శైలిలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
Advertisement
Venkatesh
Anil Ravipudi
Nandamuri Kalyan Ram
Keerthy Suresh
Krithi Shetty
Sankranthi 2027

More Telugu News