పక్కనే ఉన్న ఆంధ్రాను చూసి కర్ణాటక చాలా నేర్చుకోవాలి: కేంద్రమంత్రి కుమారస్వామి
- కర్ణాటక సర్కార్‌పై కేంద్ర మంత్రి కుమారస్వామి విమర్శలు
- అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను చూసి నేర్చుకోవాలని హితవు
- రాజకీయాలకు అతీతంగా ఏపీ నేతలు ఏకమవుతారని ప్రశంస
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ, అనకాపల్లి ప్రాజెక్టును ప్రస్తావించిన కుమారస్వామి
- కర్ణాటకలో మైనింగ్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వమే అడ్డంకి అని ఆరోపణ
అభివృద్ధి విషయంలో కర్ణాటక ప్రభుత్వం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను చూసి నేర్చుకోవాలని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం ఐక్యంగా పనిచేయడంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. సోమవారం బెంగళూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర అభివృద్ధి విషయానికి వస్తే, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్‌లోని నాయకులంతా ఏకతాటిపై నిలుస్తారని కుమారస్వామి ప్రశంసించారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవడంలో ఏపీ చూపుతున్న చొరవను కర్ణాటక ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజీ, అనకాపల్లిలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక కృషి చేశారని, అనకాపల్లి ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి స్వయంగా హాజరు కావాలని తనను కోరారని కుమారస్వామి గుర్తుచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిణామాల నేపథ్యంలో అక్కడి ప్రజలు తనకు ఘనస్వాగతం పలికారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి సైతం ఎలక్ట్రిక్ బస్సులు, స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టుల కోసం కేంద్ర సహకారాన్ని పదేపదే కోరుతున్నారని ప్రస్తావించారు.
"తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ, ఆయన పలుమార్లు కేంద్రం పెద్దలను కలిసి రాష్ట్రం ప్రయోజనాల కోసం విజ్ఞప్తులు చేశారు" అని పేర్కొన్నారు.
కానీ, కర్ణాటకలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని కుమారస్వామి ఆరోపించారు. కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీకి సంబంధించిన మైనింగ్ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తోందని, దీనివల్ల వేలాది మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పరిస్థితి విషమిస్తే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
బెంగళూరు నగరంలో చెట్లను పెంచామని ఒక రాష్ట్ర మంత్రి చెబుతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వరి నాటు వేసినట్లుగా చెట్లను నాటారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రంలో తాను భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని కుమారస్వామి మండిపడ్డారు.