గెలిచి తప్పు చేశా.. రాజకీయాల్లో ఎందుకున్నానో అనిపిస్తోంది: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

Mandali Buddha Prasad says winning was a mistake and questions being in politics
  • ఈసారి ఎమ్మెల్యేగా గెలవడమే పెద్ద తప్పు చేశానని మండలి బుద్ధప్రసాద్ 
  • దిగజారిన రాజకీయ విలువలను చూసి రోజూ బాధపడుతున్నానని ఆవేదన
  • రోశయ్య లాంటి హుందాతనం నేటి నేతల్లో కొరవడిందని విచారం
  • గత ప్రభుత్వం రోశయ్య విగ్రహ ఏర్పాటును అడ్డుకుందని ఆరోపణ
  • విజయవాడలో రోశయ్య విగ్రహావిష్కరణతో తన సంకల్పం నెరవేరిందన్న బుద్ధప్రసాద్
అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే, శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈసారి ఎమ్మెల్యేగా గెలవడమే పెద్ద తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. దిగజారిపోతున్న రాజకీయ విలువలను చూసి తాను నిత్యం బాధపడుతున్నానని విచారం వ్యక్తం చేశారు. శనివారం విజయవాడ భవానీపురంలో వాసవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బుద్ధప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. దివంగత నేత రోశయ్య రాజకీయ హుందాతనాన్ని, ఆయన పాటించిన విలువలను కొనియాడారు. "రోశయ్య గారు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. ప్రత్యర్థులను సైతం గౌరవించే సంస్కారం ఆయనది. నేటితరం నాయకుల్లా కలుషితమైన, అప్రజాస్వామిక భాషను ఆయన ఎన్నడూ వాడలేదు. ఆయనకు కేవలం సిద్ధాంతపరమైన విభేదాలే ఉండేవి తప్ప, వ్యక్తిగత దూషణలు చేసేవారు కాదు" అని గుర్తుచేసుకున్నారు. 

దివంగత ఎన్టీ రామారావుతో అసెంబ్లీలో తీవ్రంగా విభేదించినప్పటికీ, వారి మధ్య వ్యక్తిగత అనుబంధం గొప్పగా ఉండేదని ఓ సంఘటనను వివరించారు. తన వివాహానికి హాజరైన ఎన్టీఆర్, రోశయ్యను తన పక్కనే కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా ముచ్చటించారని చెబుతూ బుద్ధప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు.

ప్రస్తుత రాజకీయాల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "రోశయ్య వంటి మహానుభావులతో కలిసి మేం గౌరవప్రదమైన రాజకీయాలు చేశాం. కానీ ఇప్పుడు ఎలాంటి వికృత రాజకీయాల్లోకి వెళ్తున్నామో అర్థం కావడం లేదు. అసలు ఈ రాజకీయాల్లో ఎందుకు కొనసాగుతున్నామా అని రోజూ బాధపడాల్సి వస్తోంది" అని ఆవేదన వెళ్లగక్కారు. వేదికపై ఉన్న బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరిని ఉద్దేశిస్తూ, ప్రస్తుత పరిస్థితులను చూసి ఆయన కూడా తనలాగే లోలోపల మదనపడుతున్నారని వ్యాఖ్యానించారు. కలుషితమైన ఈ తరుణంలో రోశయ్య విగ్రహం సమాజానికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.

గత వైసీపీ ప్రభుత్వంపై కూడా బుద్ధప్రసాద్ విమర్శలు చేశారు. అవనిగడ్డలో రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుందని ఆరోపించారు. "ఆనాడు నేను ఒక శపథం చేశాను. మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి, అవనిగడ్డలో రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాతే ఇతర పనులు చేపడతానని మాటిచ్చాను. ఈ రోజు వాసవీ ఫౌండేషన్ చొరవతో విజయవాడలో ఈ విగ్రహావిష్కరణ జరగడం, నా సంకల్పం నెరవేరడం ఎంతో సంతోషాన్నిస్తోంది" అని బుద్ధప్రసాద్ వివరించారు.
Mandali Buddha Prasad
Janasena MLA
Konijeti Rosaiah Statue
Andhra Pradesh Politics
Vijayawada News
Political Values

More Telugu News