తిరుమలకు మెట్లెక్కి వెళ్లిన 116 ఏళ్ల బామ్మ.. ఇదిగో వీడియో!
- శ్రీవారి దర్శనానికి కాలినడకన 116 ఏళ్ల బామ్మ
- వయసును లెక్కచేయకుండా తిరుమల మెట్లు ఎక్కిన వృద్ధురాలు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- తమిళనాడుకు చెందిన మహిళగా గుర్తింపు
- ఆమె భక్తి, మనోబలానికి నెటిజన్ల ప్రశంసలు
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. వీరిలో కొందరు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా నడకదారిలో స్వామివారిని చేరుకుంటారు. అయితే, ఈ మార్గంలో వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రయాణించడం చాలా కష్టం. అలాంటిది, 116 ఏళ్ల బామ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల మెట్లు ఎక్కుతుండటాన్ని చూసిన మరో భక్తురాలు వీడియో తీశారు.
ఈ బామ్మ తమిళనాడుకు చెందిన వారని తెలుస్తోంది. ఆమె మనోబలం, దైవభక్తిని చూసి నెటిజన్లు అబ్బురపడుతున్నారు. "భక్తి ఉంటే వయసు అడ్డంకి కాదని ఈ బామ్మ నిరూపించారు", "ఆమె సంకల్పం యువతకు స్ఫూర్తిదాయకం" అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. శారీరక దృఢత్వం కంటే విశ్వాసం గొప్పదని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.