సైన్స్ ఫిక్షన్ కాదు.. కృత్రిమ గుడ్డుతో కోడిపిల్ల పుట్టింది!
- ప్రపంచంలో ఇదే తొలి విజయం
- సిలికాన్ పొరతో కృత్రిమ గుడ్డు
- పక్షుల సంరక్షణకు కొత్త ఆశ
- పూర్తిగా అభివృద్ధి చెందిన పిండం
- మరిన్ని పరిశోధనలు అవసరమన్న నిపుణులు
అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ‘కలొసల్ బయోసైన్సెస్’ తొలిసారిగా పెంకు లేని కృత్రిమ గుడ్డులో కోడిపిల్లను విజయవంతంగా పొదిగించింది. సహజ గుడ్డు పెంకు స్థానంలో ప్రత్యేక సిలికాన్ పొరతో కూడిన నిర్మాణాన్ని రూపొందించారు. ఇది ఆక్సిజన్ లోపలికి చేరేలా, కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళ్లేలా పనిచేసింది. దీంతో పిండం పూర్తిగా అభివృద్ధి చెంది ఆరోగ్యకరమైన కోడిపిల్ల బయటకు వచ్చింది.
సాధారణ గుడ్డు పెంకు పిండాన్ని రక్షించడమే కాదు. శ్వాసక్రియకు అవసరమైన వాయువుల మార్పిడిని కూడా నియంత్రిస్తుంది. అదే పనిని కృత్రిమ నిర్మాణంతో చేయడం శాస్త్రవేత్తలు సాధించిన అతిపెద్ద విజయం.
అంతరించిపోతున్న పక్షుల గుడ్లను సంరక్షించడం చాలా కష్టం. అలాంటి సందర్భాల్లో ఈ కృత్రిమ గుడ్డు సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. దీంతో అరుదైన పక్షి జాతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
అన్ని పక్షులపై ఇదే విధానం పనిచేస్తుందా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు నిర్వహించి వివిధ జాతులపై దీని ప్రభావాన్ని పరిశీలించనున్నారు.