పిల్లలకు పదేళ్లు రాకముందే.. ఈ క్షణాలను మిస్ కావొద్దు!
- వారితో కలిసి ఆడుకోవాలని నిపుణుల సూచన
- కలిసి చదివితే వారిలో పుస్తకాలపై ఆసక్తి పెరుగుతుంది
- తప్పు జరిగితే సారీ చెప్పాలంటున్న నిపుణులు
- చిన్న పనులు చేసుకోవడం వంటి జీవిత పాఠాలు నేర్పాలి
- వారి అనుభవాలను అడిగి తెలుసుకోవాలని సూచన
ఆటతో అనుబంధం
పిల్లలు ఆడే ఆటల్లో మీరూ చేరాలని నిపుణులు సూచిస్తున్నారు. పెద్దలు నిర్ణయించిన ఆటల కంటే, పిల్లలు ఎంచుకున్న ఆటల్లో పాల్గొనడం వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో భద్రతా భావం పెరగడంతో పాటు తల్లిదండ్రులతో భావోద్వేగ బంధం మరింత బలపడుతుందని వివరించారు.
కథలతో మాయ
పిల్లలు చదవడం నేర్చుకున్న తర్వాత కూడా వారికి కథలు చదివి వినిపించాలని సూచిస్తున్నారు. కలిసి చదివే సమయం పిల్లల్లో పుస్తకాలపై ఆసక్తిని పెంచడమే కాకుండా మంచి సంభాషణలకు కూడా దారితీస్తుందని తెలిపారు. భయం, స్నేహం, దయ వంటి విలువలను సహజంగా నేర్పే అవకాశం కూడా ఇదేనని పేర్కొన్నారు.
‘సారీ’ చెప్పడం కూడా పాఠమే
తప్పు జరిగినప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు క్షమాపణ చెప్పడానికి వెనుకాడొద్దని నిపుణులు అంటున్నారు. దీంతో పిల్లలు బాధ్యత తీసుకోవడం, తప్పును ఒప్పుకోవడం, సంబంధాలను గౌరవించడం వంటి విలువలు నేర్చుకుంటారని తెలిపారు. ఇది వారి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.
చిన్న సంప్రదాయాలు
కలిసి నడవడం, ఇంట్లో కలిసి వంట చేయడం, వర్షాన్ని ఆస్వాదించడం వంటి చిన్న చిన్న కుటుంబ సంప్రదాయాలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెబుతున్నారు. ఖరీదైన విహారయాత్రల కంటే ఇలాంటి సాధారణ క్షణాలే జీవితాంతం గుర్తుంటాయని పేర్కొన్నారు.
జీవిత పాఠాలు
చదువుతో పాటు జీవితానికి అవసరమైన నైపుణ్యాలు కూడా నేర్పాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న చిన్న పనులు స్వయంగా చేసుకోవడం, డబ్బు విలువ తెలుసుకోవడం, కృతజ్ఞత చెప్పడం వంటి అలవాట్లు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు.
వారి అనుభవాలను అడగండి
పిల్లలకు సూచనలు ఇవ్వడం మాత్రమే కాకుండా వారి రోజువారీ అనుభవాల గురించి ప్రశ్నలు అడగాలని సూచిస్తున్నారు. ‘ఈ రోజు ఏం జరిగింది?’, ‘ఏ విషయం నిన్ను సంతోషపెట్టింది?’ వంటి ప్రశ్నలు వారిలో భావాలను వ్యక్తపరిచే అలవాటు పెంచుతాయని చెప్పారు. ఇది యుక్తవయసులో కూడా తల్లిదండ్రులతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
ప్రేమను వ్యక్తం చేయండి
పిల్లలపై ప్రేమ ఉందని అనుకోవడం సరిపోదని, దాన్ని మాటల్లో కూడా వ్యక్తం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’, ‘నిన్ను చూసి గర్వపడుతున్నాను’ వంటి మాటలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు భావోద్వేగ భద్రతను కలిగిస్తాయని తెలిపారు.